ప్రొద్దుటూరు : ‘త్వరలో మీ ఇంటిపై దాడి చేసి చంపుతాం.. పూర్వం మీ అబ్బ పెద్ద వీరారెడ్డిని ఎలా చంపారో అలాంటి పరిస్థితే నీకు వస్తుంది’ అని టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి స్పీడ్ పోస్టు ద్వారా బెదిరింపు లేఖ రాశారు. లేఖలో రాసిన ఫోన్ నంబర్, అడ్రెస్ ఫేక్ అని తెలుసుకున్నారు. ప్రొద్దుటూరులో టీడీపీ వర్గీయుల మధ్య రాళ్లు రువ్వుకున్న సంఘటన జరిగిన పది రోజులు కాకమునుపే ఈ లేఖ వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎస్‌ఎస్ మాల్ విషయంపై జీవీ ప్రవీణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణకు వచ్చిన సందర్భంగా గత నెల 26వ తేదీన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వర్గీయులు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గీయులు రాళ్లు రువ్వుకున్న సంఘటన తెలిసిందే. సాధారణంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులు కేసులు నమోదు చేయడం పరిపాటి. అయితే ఇరువురు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇది ఇలా ఉండగానే ప్రస్తుతం ఆర్.ఈశ్వర్‌రెడ్డి పేరుతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. లేఖలో టౌన్ బ్యాంక్ అంశాన్ని ప్రస్తావించారు. త్వరలో మీ ఇంటిపై దాడి చేస్తామని, దమ్ముంటే ప్రాణాలను కాపాడుకోవాలని లేఖలో పొందుపరిచారు. ఇటీవల ఎమ్మెల్యే వర్గీయులు మార్కెట్‌యార్డులో శనగలను కొనుగోలు చేశారు. దీనిపై ఆర్టీఐ పెట్టిన ప్రవీణ్ కుమార్‌రెడ్డి వర్గీయుడు పర్లపాడు చంద్రను కూడా బెదిరించినట్లు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
తాటాకు చప్పులకు బెదరను
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్‌రెడ్డి తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరా లేని చోట ఈ లేఖను రాసి పంపారన్నారు. దమ్ముంటే అధికారికంగా రాసి పంపాలని కోరారు. వ్యవసాయ మార్కెట్‌యార్డు డైరెక్టర్ సుధాకర్ రాసినట్లుగా ఈ అక్షరాలు ఉన్నాయని ప్రవీణ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఇంతటితో తాను ఆగనని, డీఏడబ్ల్యూ కాలేజీ, మహర్షి స్కూల్, సుందరయ్య నగర్, తదితర అంశాలపై చర్చిస్తానన్నారు. మైలవరం కాలువపై అక్రమ నిర్మాణాల విషయం గురించి కూడా మాట్లాడుతానన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే చంపుతారా అని ప్రవీణ్ అన్నారు. ఈ విషయంపై ఏఎస్పీ విభూ కృష్ణకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
ఇంటికొచ్చి చంపుతామని లేఖలో పేర్కొన్నారు
రాళ్లు రువ్వుకున్న సంఘటన
మరువక ముందే మరో ఘటన


