కడప అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలలో పని చేస్తున్న సెక్యూరిటీ, పారిశుద్ధ్య, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్– వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పని ప్రదేశాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఏఐటీయూసీ పిలుపులో భాగంగా శుక్రవారం కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్ అత్యవసర ముఖద్వారం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జి.వేణుగోపాల్, కేసీ బాదుల్లా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ కార్మికులకు కొత్తగా వచ్చిన ఏజెన్సీ నిర్వాహకులు ఎంవోయూ ప్రకారం వేతనాలు 13960 రూపాయలు ఇవ్వకుండా తగ్గించి ఇస్తున్నారని విన్నవిస్తున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు అధికారుల ఆదేశాలు పాటించాలా? లేక అధికారులు కాంట్రాక్టర్లకు లోబడి పని చేయాలా? అనే విషయంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులే తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. 10–15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కార్మికులను పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు పర్మినెంట్ చేస్తున్నాయని వాటిని చూసి అయినా మన రాష్ట్రంలో ఎప్పుడు పర్మినెంట్ చేస్తారని ఎదురు చూస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయకపోగా.. ఒక్క మెడికల్ రంగంలోనే 50 సంవత్సరాలు నిండిన పారిశుద్ధ్య కార్మికులను తొలగిస్తున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం నోరు మెదపకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ప్రతి నెల 10వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, జాతీయ పర్వదినాలకు సెలవులు ఇవ్వాలని అడుగుతున్నా, ఇవన్నీ మీకు వర్తించవు కార్మిక చట్టాలు వర్తింప చేయము పిఎఫ్, ఈఎస్‌ఐ ఇష్టానుసారంగా చెల్లిస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని అడిగిన కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 8న రాష్ట్ర వ్యాప్త జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు, 15న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఉద్దె మద్దిలేటి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.సుబ్బరాయుడు, సెక్యూరిటీ గార్డ్ యూనియన్ నాయకులు రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.


