వైద్యం వికటించి తల్లీశిశువు మృతి | - | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి తల్లీశిశువు మృతి

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

మృతదేహాలతో ఆసుపత్రి వద్ద

కుటుంబ సభ్యుల ఆందోళన

జమ్మలమడుగు రూరల్‌ : జమ్మలమడుగు పట్టణంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వైద్యం వికటించి తల్లి, నవజాత శిశువు మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జమ్మలమడుగు పట్టణంలోని గడ్డవీధికి చెందిన పఠాన్‌ రుక్సానా (28) అనే గర్భిణిని గురువారం ప్రసవానికి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. పురిటి నొప్పులు రావడంతో వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, బిడ్డ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. దీంతో శుక్రవారం కుటుంబ సభ్యులు, బంధువులు.. మృతదేహాలతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనపై అరా తీశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహనికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తే అసలు విషయం తెలుస్తుందని సీఐ నరేష్‌బాబు బాధితులకు సూచించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డలు మృతి చెందారని, వైద్యులతో తమకు క్షమాపణ చెప్పించాలని కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పడంతో మృతదేహాలను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయమై డాక్టర్‌ లక్ష్మీరెడ్డిని వివరణ కోరగా.. రుక్సానాను గురువారం తమ ఆసుపత్రికి తీసుకొచ్చారన్నారు. ఆమెకు నొప్పులు రాకపోవడంతో శస్త్రచికిత్స చేసి నవజాత శిశువును బయటకు తీశామన్నారు. అప్పటికే శిశువు మృతి చెందినట్లు తెలిపారు. ఈ క్రమంలో రుక్సానాకు మూర్ఛ, గుండెపోటు రావడంతో వెంటనే ప్రొద్దుటూరుకు తీసుకెళ్లాలని సూచించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement