కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లాలో రవాణా శాఖ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, వాహనదారులకు అత్యంత కీలకమైన డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియ అస్సలు ముందుకు సాగడం లేదు. రవాణా శాఖ నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక లక్షకు పైగా డిజిటల్ కార్డులు పెండింగ్‌లో పడిపోవడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నెలకు 4 వేల దరఖాస్తులు
వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్ ప్రాంతాలలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ నాలుగు కార్యాలయాల పరిధిలో నెలకు సగటున 2 వేల డ్రైవింగ్ లైసెన్స్‌లు, మరో 2 వేల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల చొప్పున మొత్తం 4 వేల కార్డులు జారీ కావాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు ప్రభుత్వానికి నిబంధనల ప్రకారం ఫీజులు చెల్లించినా, రెండేళ్లుగా పర్మినెంట్ డిజిటల్ కార్డులను ముద్రించి ఇవ్వడంలో రవాణా శాఖ పూర్తిగా విఫలమైంది.
రూ. 2.10 కోట్లు వసూలు
రవాణా శాఖ అధికారులు వాహనదారుల నుంచి పర్మినెంట్ డీఎల్, ఆర్‌సీ చలానాలు కట్టించుకునే సమయంలో స్మార్ట్ కార్డుల కోసం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.210 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు 80 నుంచి 100 వరకు డీఎల్, ఆర్‌సీ కార్డులు జారీ అవుతుంటాయి. ఈ లెక్కన ప్రతిరోజూ సుమారు రూ.21 వేల మేర రవాణా శాఖ ద్వారా వాహనదారులు ప్రభుత్వానికి అదనంగా సొమ్ము చెల్లిస్తున్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న లక్ష కార్డుల లెక్కన చూసుకుంటే ఇప్పటికే దాదాపు రూ.2.10 కోట్ల భారీ మొత్తాన్ని ముందస్తుగానే వసూలు చేసిన అధికారులు, కార్డులు మాత్రం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో డ్రైవర్ల తిప్పలు
వేల రూపాయల ఫీజులు కట్టినా కార్డులు రాకపోవడంతో వాహనదారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో వివిధ ప్రైవేట్ వెబ్‌సైట్‌లను ఆశ్రయించి నానా తిప్పలు పడుతున్నారు. అక్కడ భారీగా డబ్బులు చెల్లించి డూప్లికేట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకొని వాడుకుంటున్నారు. అయితే లారీల డ్రైవర్లు, యజమానులు ఇతర రాష్ట్రాలకు బాడుగలకు వెళ్లినప్పుడు అక్కడి రవాణా, పోలీస్ శాఖ అధికారులు ఒరిజినల్ ఆర్‌సీ, డీఎల్ మాత్రమే చూపాలని పట్టుబడుతున్నారు. రవాణా కార్యాలయాలకు వెళ్లి నిలదీస్తే ‘ఆన్‌లైన్ నుంచి డిజిటల్ ప్రింట్ తీసుకోండి‘ అంటూ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని, తీరా ఆ ప్రింట్లను పక్క రాష్ట్రాల్లో చూపిస్తే పోలీసులు ఒప్పుకోవడం లేదని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసుల కాళ్లా వేళ్లా పడి, భారీగా లంచాలు ఇచ్చుకుని బయటపడాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్ కార్డులను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా జారీ కాని డీఎల్, ఆర్‌సీ కార్డులు
రూ. 2.10 కోట్లు ముక్కుపిండి వసూలు చేసినా లభించని మోక్షం
జిల్లా వ్యాప్తంగా లక్ష కార్డులు
పెండింగ్.. రవాణా శాఖ స్మార్ట్ మోసం!


