అటవీశాఖ వాహనాన్ని ఢీ కొన్న బైక్‌ | - | Sakshi
Sakshi News home page

అటవీశాఖ వాహనాన్ని ఢీ కొన్న బైక్‌

Jun 5 2026 4:05 AM | Updated on Jun 5 2026 4:05 AM

ఒంటిమిట్ట : మంటపంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ సమీపంలోని జగనన్న కాలనీ వద్ద ఆగి ఉన్న అటవీశాఖ వాహనాన్ని బైక్‌ ఢీ కొట్టిన ప్రమాదంలో అటవీ శాఖ వాహన డ్రైవర్‌ నాగ చంద్రకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు..వాహనాల తనిఖీ కోసం అటవీశాఖ అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ రామచంద్రారెడ్డి, డ్రైవర్‌ నాగ చంద్ర జగనన్న కాలనీ వద్ద జీపు ఆపి నాగ చంద్ర డోర్‌ తీసి దిగుతుండగా బోపల్లి నుంచి మంటపంపల్లి వైపు అతివేగంగా ద్విచక్ర వాహనంలో వస్తున్న బోయ మహేష్‌, చరణ్‌లు ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో నాగ చంద్ర తీవ్రగాయాలయ్యాయి. మహేష్‌, చరణ్‌లకు కూడా గాయాల అయ్యాయి. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహన చోదకుడు బోయ మహేష్‌పై అసిస్టెంట్‌ అటవీ శాఖ బీట్‌ ఆఫీసర్‌ రామచంద్రారెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

ఆటో చోరీపై ఫిర్యాదు

మైదుకూరు : పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డుకు చెందిన షేక్‌ ఖాదర్‌ వలీ సొంత ఆటో చోరీకి గురైనట్టు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఖాదర్‌ వలీకి రెండు ఆటోలు ఉండగా ఒకదానిని తనే నడుపుకొంటూ మరొక ఆటోను మైదుకూరుకు చెందిన రెడ్డి బాబు అనే వ్యక్తికి రోజువారి అద్దెకిచ్చారు. గత నెల 28న రెడ్డి బాబు స్థానిక బద్వేలు రోడ్డులోని వైన్‌ షాప్‌ వద్ద ఆటోను నిలిపి షాపులోకి వెళ్లి తిరిగి వచ్చి చూడగా ఆటో కనిపించలేదు. విషయం ఖాదర్‌ వలీకి తెలపడంతో ఇద్దరూ పట్టణంలో వెతకినా కనిపించలేదు. చోరీకి గురైనట్టు భావించి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి ఆటో కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు

బద్వేలు అర్బన్‌ : విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే వైద్యులు, సిబ్బందిపై చర్యలు తప్పవని డిస్ట్రిక్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ (డీసీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ హిమదేవి పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఓపీని పరిశీలించి రోగులతో మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగుల పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలని సూచించారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఓపీ డిజిటలైజేషన్‌ చేయాల్సి ఉందని, ఇందుకోసం ఆసుపత్రికి వచ్చే రోగులు ఆధార్‌కార్డుతో పాటు ఆధార్‌కార్డుకు లింక్‌ అయిన ఫోన్‌నెంబరు తీసుకుని రావాలని కోరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న వైద్యుల కొరతను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను తనిఖీ చేసి వైద్యులకు, సిబ్బందికి సూచనలిచ్చారు. ఆమె వెంట ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డితో పాటు ఇతర వైద్యులు పాల్గొన్నారు.

గ్యాస్‌ లీకేజీతో దుకాణంలో మంటలు

జమ్మలమడుగు : మండల పరిధిలోని పి. బొమ్మెపల్లిలోని ఓ టీ దుకాణంలో గురువారం గ్యాస్‌ లీకేజీ కావడంతో మంటలు వ్యాపించాయి. దీంతో దుకాణంలోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.1.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని దుకాణం యజమాని హరినాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హరినాథ్‌రెడ్డి టిఫిన్‌, టీ, తినుబండరాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఒక్కసారిగా గ్యాస్‌ లీకేజీ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement