● ఎస్‌ఐఆర్ వల్ల ముఖ్యమంత్రులు ఓడిపోయారు
● రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి
సిద్దవటం : వైఎస్‌ఆర్‌సీపీకి ప్రతి ఓటు కీలకమేనని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అన్నారు. మండలంలోని కనుములోపల్లి ఆకేపాటి గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌పై బీఎల్‌ఏలకు గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి బీఎల్‌ఏ బీఎల్‌ఓతో కలిసి ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కూడా ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. ఆ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలలో గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. 24 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎస్‌ఐఆర్ ద్వారా ఇటీవల పలు రాష్ట్రాలలో కొన్ని లక్షల ఓట్లు తొలగించడంతో ఇటీవల పలు రాష్ట్రాలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమంత్రులే ఓడిపోయారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు బోగస్ ఓట్లు ఎక్కించే అవకాశం ఉందని, బీఎల్‌ఏలు ఓటరు జాబితాలోని ప్రతి ఓటరు పేరును పరిశీలించాలని, బోగస్ ఓట్లు ఉంటే బీఎల్‌ఓలకు ఫిర్యాదు చేసి వాటిని తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాజంపేట పార్టీ కార్యాలయంలో వార్ రూం ఏర్పాటు చేశామని, ఏమైనా సమస్యలుంటే వారు అక్కడికి వస్తే రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. బీఎల్‌ఏలు ఒక నెల పాటు కష్టపడి సమష్టిగా పనిచేస్తే ప్రతి ఓటును కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కె.పెంచలయ్య, రాయలసీమ జోనల్ బూత్ కమిటీ కన్వీనర్ తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, బూత్ కమిటీ మండల కన్వీనర్ నారపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మారుతి పిల్లి, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు నడివీధి సుధాకర్, జనరల్ సెక్రటరీ వలీచాన్, జిల్లా బూత్ సెక్రటరీ కాడే శివయ్యనాయుడు, బూత్ కమిటీ అసిస్టెంట్లు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


