● పోస్టర్లు ఆవిష్కరించిన సీఈసీ మెంబర్‌ సురేష్‌బాబు | - | Sakshi
Sakshi News home page

● పోస్టర్లు ఆవిష్కరించిన సీఈసీ మెంబర్‌ సురేష్‌బాబు

Jun 4 2026 5:16 AM | Updated on Jun 4 2026 5:16 AM

● పోస్టర్లు ఆవిష్కరించిన సీఈసీ మెంబర్‌ సురేష్‌బాబు

సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం కూటమి రెండేళ్ల పాలనతో మరోమారు బహిర్గతమైంది. అధికారమే పరమావధిగా ఎన్నికల ముందు ముఖానికేసుకున్న అబద్ధాల హామీల ముసుగు అధికారంలోకి రాగానే తొలగిపోయింది. ‘నాడు–నేడు’ వెలుగులు కరిగిపోయి విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం ఆవహించింది. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్‌ గ్యారెంటీ’ కాదు.. ‘బాబును నమ్మితే మోసం గ్యారంటీ’ అని విశ్లేషకులు సైతం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్‌ చేసిన వెన్నుపోటుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నేడు (గురువారం) జిల్లావ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యక్ష ఆందోళనలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి పిలుపునిచ్చారు.

ఆడబిడ్డ నిధికి కూటమి సర్కార్‌ మంగళం!

18 ఏళ్లు నిండిన ప్రతి యువతి నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని చంద్రబాబు ఊరూవాడా నమ్మబలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఈ పథకం ఊసే ఎత్తడం లేదు.

నిరుద్యోగ భృతి మాటే మరిచారు

‘ప్రతి ఇంటికీ ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి’ అంటూ ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం ద్వారా ఊదరగొట్టిన చంద్రబాబు గద్దెనెక్కాక ఆ మాట పూర్తిగా మరిచారు. నిరుద్యోగ భృతి కింద ఈ రెండేళ్ల కాలానికి ప్రతి నిరుద్యోగికి రూ.72,000 లభించాల్సి ఉంది.

ఏటా పెరుగుతున్న నిరుద్యోగుల జాబితా:

జిల్లాలో వైవీయూ పరిధిలో ఏటా డిగ్రీ పూర్తి చేసే 12,000 మంది, ఇంటర్‌ పాస్‌ అయ్యే 15,000 మంది, ఇంజనీరింగ్‌ పట్టా పొందే 6,000 మందితో కలిపి ఏటా కనీసం 35,000 మంది యువత చేతిలో పట్టాలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అటు ఉద్యోగాలూ ఇవ్వక, ఇటు భృతీ దక్కక యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

నాడు మహిళలే మహారాణులు

గత వైఎస్సార్‌సీపీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మహిళల ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారు. జిల్లాలో 2,16,222 మంది తల్లులకు ‘అమ్మ ఒడి’ ద్వారా నాలుగేళ్లలో రూ.912 కోట్ల ఆర్థిక సాయం అందింది. డ్వాక్రా సంఘాల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ ‘సున్నా వడ్డీ’ కింద రూ. 190 కోట్లు అందజేశారు. కోట్లాది రూపాయల విలువైన ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలను మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు ఇచ్చారు. కామధేనువు లాంటి జగనన్న సర్కార్‌ను పోగొట్టుకున్నామని మహిళలు మదనపడుతున్నారు.

నేడు ఊరువాడా నిరసన జ్వాలలు

కూటమి సర్కార్‌ ప్రజలను నిలువునా ముంచినందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ క్షేత్రస్థాయిలో పోరుబాట పట్టింది. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాటం సాగుతుందని, జిల్లాలోని పార్టీ కేడర్‌, నాయకులు అందరూ అన్ని కేంద్రాలలోని నిరసనల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు కాగితాలకే పరిమితం అయ్యాయని వైఎస్సార్‌సీసీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ కె. సురేష్‌ బాబు అన్నారు. బుధవారం మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు మాసీమ బాబులతో కలిసి ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లను ఆవిష్కరించారు. గురువారం నిర్వహించే నిరసన కార్యక్రమాలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement