కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజారోగ్య పరిరక్షణకు వైద్యులు కట్టుబడి పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ అమలుచేస్తున్న కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించామని, వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు వైద్య సేవలందించాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటించాలని,సెలవులు తీసుకొనేందుకు ముందస్తుగా అనుమతి తీసుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. సంజీవని కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేసేందుకు అవసరమైన సదుపాయాల కల్పనతోపాటు వైద్యులందరికీ అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు, డిసిహెచ్‌ఎస్ డా.హిమదేవి, మెడికల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
స్మార్ట్ కిచెన్ షెడ్స్‌పై సమీక్ష
జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులు జూన్ 8వ తేదీ నాటికి పూర్తి స్థాయి లో సిద్ధం కావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో కలెక్టర్ కేఎంసీ కమిషనర్ హెచ్‌ఎస్ భావనతో కలిసి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యూనిక్ గా ఏర్పాటు కానున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ భవన నిర్మాణాల పురోగతిపై సంబంధిత జిల్లా, క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సీపీఓ హజరతయ్య, స్మార్ట్ కిచెన్ల పర్యవేక్షకులు జోయల్ విజయకుమార్, డీఆర్డిఏ పీడీ రాజ్యలక్ష్మి, డీఈఓ శంషుద్దీన్, హౌసింగ్ పీడీ రాజరత్నం తదితరులు పాల్గొన్నారు.
ఓటరు మ్యాపింగ్ పక్కాగా జరగాలి
ప్రతి ఓటరు మ్యాపింగ్ పక్కాగా జరగాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈఆర్‌ఓ,ఏఈఆర్‌ఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటా జనగణన, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా ఎలాంటి తప్పు లు లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ మ్యాపింగ్‌లో రెవెన్యూ శాఖతో సమన్వయంతో పని చేయాలన్నా రు. ఇంటింటా జనగణన నమోదు ప్రక్రియను ప్రభుత్వం జూన్ 6వరకు పొడిగించిందన్నారు. ఈ ఇంటింటా జనగణనపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ మల్లికార్జునుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి పాల్గొన్నారు.


