ప్రాణం తీసిన బైక్‌ పొగ | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన బైక్‌ పొగ

Mar 16 2026 7:38 AM | Updated on Mar 16 2026 7:38 AM

పుంగనూరులో విషాదం

ఒకే కుటుంబంలో నలుగురు మృతి

నిద్రలోనుంచి..మృత్యుఒడికి

ప్రాణాలతో బయటపడ్డ బిందు

కుటుంబ పెద్ద అమాయకత్వం ఆ ఇంటిలోని నలుగురి పాలిట శాపంగా పరిణమించింది. కుటుంబ పనుల కోసం సౌకర్యంగా ఉంటుందని కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం కన్న తండ్రి, కడుపున పుట్టిన బిడ్డలపాలిట మృత్యు శకటంగా మారింది. టూ వీలర్‌ నుంచి వెలువడిన విషవాయువులతో ఆదమర్చి గాఢ నిద్రలో ఉన్న నలుగురు విగత జీవులుగా మారారు. ఈ విషాదకర ఘటన ఆదివారం పుంగనూరు పట్టణంలో జరిగింది.

పుంగనూరు : పుంగనూరులో విషాదం జరిగింది. ద్విచక్రవాహనం (బైక్‌) నుంచి వచ్చే కార్బన్‌ మోనాకై ్సడ్‌ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి చెందారు.. వివరాలు.. పట్టణంలోని త్యాగరాజవీధిలో నాయీబ్రాహ్మణ కులానికి చెందిన మురళి, ఆయన భార్య రేవతి, మురళి తండ్రి రామచంద్ర (75) ఉంటున్నారు. మురళికి కార్తీక్‌(15), బిందు (14)తో పాటు కవలపిల్లలు చందన(7), చరిత(7) ఉన్నారు. కార్తీక్‌ స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. చరిత, చందనలు ప్రైవేట్‌స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నారు. ఇలా ఉండగా మురళికి చెందిన ద్విచక్రవాహనం బోరుకు రావడంతో మెకానిక్‌ వద్దకు వెళ్లి శనివారం బాగు చేయించాడు. బైక్‌ను తీసుకొచ్చి రాత్రి మెకానిక్‌ సూచనల మేరకు స్టార్టింగ్‌లోనే ఇంటిలోని హాల్‌లో పెట్టాడు. మురళి దంపతులు మిద్దైపెన గల గదిలో పడుకున్నారు. తాత రామచంద్ర, మనవడు కార్తీక్‌ ,కవలపిల్లలు చరిత, చందనలు తాతతో కలసి నిద్రకు ఉపక్రమించారు. కాగా మరో మనవరాలు బిందు బంధువుల ఇంటికి వెళ్లడంతో ఆ పాప ఇంటిలో లేదు. ఇంట్లో కిటికీలు లేకపోవడంతో బైక్‌ నుంచి వచ్చే కార్బన్‌ మోనాకై ్సడ్‌ ఇంట్లో చుట్టుకుంది. తాత, మనవడు, మనవరాళ్లు ఆ విషవాయులను పీల్చడంతో రాత్రి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఉదయం మిద్దైపె నుంచి కిందకు వచ్చిన మురళి, ఆయన భార్య నలుగురు చనిపోయిన విషయాన్ని గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో మురళి ఇంటికి వచ్చారు. మృతదేహాలకు నివాళులర్పించారు.

ప్రాణాలతో బయటపడిన బిందు..

విషవాయువులు పీల్చి మృతి చెందిన కుటుంబంలో ఉన్న బిందు ప్రాణాలతో బయటపడింది. శనివారం తమ బంధువుల ఇంటికి వెళ్లింది. లేకపోతే విషవాయువులకు బిందు కూడా బలయ్యేది.

ఎమ్మెల్యే, ఎంపీ పరామర్శ..

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిదున్‌రెడ్డిలు సంతాపం తెలిపారు. తక్షణమే మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాను సంఘటన స్థలానికి పంపారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామి ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement