ఒంటిమిట్ట(రాజంపేట): ఒంటిమిట్ట కోదండరామాలయంలో సోమవారం నుంచి ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆదివారం ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన పనులు పూర్తి చేశారు. తూర్పు గాలిగోపురం ఎదురుగా మండపం సమీపంలో దాతల సహకారం, తిరుమల తిరుపతి దేవస్ధానం నిధులతో శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉచిత అన్న ప్రసాదవితరణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక బంతికి 200 మంది కూర్చొని భుజించేలా ఏర్పాటుచేస్తున్నామని తిరుమ తిరుపతి దేవస్ధానం డిప్యూటీ ఇంజినీరు (సివిల్) మాదాసి నాగరాజు తెలియజేశారు. పనులను ఇన్‌చార్జి డిప్యూటీ ఈవో శివప్రసాద్, టీటీడీ సివిల్ డీఈ నాగరాజు, ఆలయ సూపరింటెండెంట్ హనుమంతులు పర్యవేక్షించారు. కాగా బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా అన్నప్రసాదవితరణ కేంద్రాన్ని తీసుకొస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. . తొక్కిసలాట, తోపులాటకు తావులేకుండా ప్రశాంతంగా అన్నప్రసాదాలను భక్తులు స్వీకరించేలా సివిల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ డీఈ మాదాసి నాగరాజు నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా మూడు పూటల అన్నప్రసాదవితరణ కేంద్రం భక్తులకు సేవలందించనున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.


