● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
డాక్టర్ సి.యామిని
● జిల్లావ్యాప్తంగా 77028 కేసులకు, రూ.3కోట్ల 52 లక్షల నష్టపరిహారం
కడప అర్బన్: జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా 7708 కేసులు పరిష్కారం కాగా... రూ.3,52,00,000లు కక్షిదారులకు చెల్లించారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కడపలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 23 బెంచీలు ఏర్పాటు చేశారు. కడపలో 5, ప్రొద్దుటూరులో 3, రాజంపేటలో 2, రాయచోటిలో 3, బద్వేల్‌లో 2, సిద్దవటం, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, నందలూరు, రైల్వే కోడూరులో ఒక్కొక్క బెంచిని ఏర్పాటు చేశారు. జాతీయ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు, లోక్ అదాలత్ మెంబెర్స్, కక్షిదారులు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి వారి కేసులను పరిష్కరించుకున్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా కృషి చేసినందుకు గాను న్యాయవాదులకు, రెవెన్యూ సిబ్బందికి, పోలీసు , ఇన్స్యూరెన్స్, బ్యాంకు, చిట్ ఫండ్ , లేబర్ డిపార్ట్‌మెంట్, వైద్య తదితర శాఖల అధికారులందరికీ జిల్లా ప్రధానన్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు.


