చాపాడు : మండల కేంద్రమైన చాపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నక్కలదిన్నె రోడ్డులో నూతనంగా రూ.3కోట్లతో నిర్మించిన భవనాల్లోకి మారుస్తూ గురువారం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సాక్షిగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ప్రభుత్వ కార్యక్రమమా లేక టీడీపీ కార్యక్రమమా అనే విధంగా శిలాఫలకంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు టీడీపీకి చెందిన వ్యక్తుల పేర్లను అనధికారికంగా పొందుపరిచారు. సంబంధిత శాఖకు చెందిన లేదా మండల అభివృద్ధి సంబంధిత అధికారులు, పాఠశాల భవనాల నిర్మాణాలకు చెందిన అధికారులచే ప్రోటోకాల్ నిబంధనల మేరకు శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇలాంటి శిలాఫలకంలోనే టీడీపీకి చెందిన వారి పేర్లు నిండి ఉన్నాయి. మండల, గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల కంటే ముందుగానే టీడీపీకి చెందిన ప్రోటోకాల్‌కు సంబంధం లేని వారి పేర్లను పొందుపరిచారు. ఇలాంటి శిలాఫలకాన్ని సాక్షుత్తు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆవిష్కరించి స్కూల్ భవనాలను ప్రారంభించడం గమనార్హం. ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించి శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైన సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అసరం ఉందని స్థానిక టీడీపీ నాయకులతోపాటు ఇతర పార్టీకి చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం వర్తించని ఈ శిలాఫలకాన్ని తొలగించి నిబంధనల మేరకు మళ్లీ కొత్తది ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పుట్టా సూచించారు. ఈయన మాటలు అమలు అవుతాయా లేదా అన్నది వేచి చూడాలి.
ప్రభుత్వాలు ఏవైనా ప్రోటోకాల్ పాటించాల్సిందే
ఏ పార్టీకి చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రోటోకాల్ పాటించాల్సిందేనని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. స్థానిక జెడ్పీ హైస్కూల్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాలమైన ప్రాంగణంలో నూతనంగా పాఠశాల భవనాన్ని ఏర్పాటు కావడం, దీనికోసం స్థలాన్ని ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ పాఠశాల భవనాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు రవిశంకర్, వంశీకృష్ణ, హెచ్‌ఎం వెంకటలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, కేసీ కెనాల్ పీసీ వైస్ చైర్మన్ గురివిరెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్ రవీంద్ర, పీఏసీఎస్ చైర్మన్ నరసింహారెడ్డి, విద్యాకమిటీ చైర్మన్ ఆదిలక్ష్మి, టీడీపీ నాయకులు వేమారెడ్డి, అక్బర్, బయపురెడ్డి, బి.రవి, సలీం, సుబ్బరాయుడు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యక్రమమా.. టీడీపీ కార్యక్రమమా
అనేలా హైస్కూల్ ప్రారంభం


