ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని రేషన్ బియ్యం వ్యాపారి బుధవారం రాత్రి విష గులికలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ప్రముఖ టీవీ చానళ్లలో పని చేస్తున్న ముగ్గురు రిపోర్టతో పాటు ఒక హోంగార్డు వేధింపుల కారణంతోనే తాను ఆత్మహత్యకు యత్నించినట్లు అతను సూసైడ్ నోట్‌లో రాసుకున్నాడు. బాధితులు తెలిపిన, సూసైడ్ నోట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. ఎస్పీ సార్.. ప్రొద్దుటూరులోని ఆర్ట్స్‌కాలేజీ రోడ్డుకు చెందిన ఎస్ నజీర్‌బాషా అను నేను నా భార్యాపిల్లల పోషణకోసం రేషన్ బియ్యం వ్యాపారం చేస్తుంటాను. ఇళ్లిళ్లూ తిరిగి ప్రజల సమ్మతితోనే రేషన్ బియ్యం సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఈ పనిలో చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా కేవలం బతుకుదెరువు కోసమే చేస్తున్నాను. అయితే నా పేదరికాన్ని ఆసరాగా తీసుకొని గత కొంత కాలంగా కొందరు వ్యక్తులు నరకయాతనకు గురి చేస్తున్నారు. ముగ్గురు మీడియా ప్రతినిధులు, ఒక హోంగార్డుతో కలిసి నన్ను బెదిరించి గతంలో నా వద్ద నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేశారు. అయినప్పటికీ వారి కక్కుర్తి తీరలేదు. మళ్లీ ఈ రోజు నా వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వమని డిమాండు చేశారు. నేను ఇవ్వలేనని చెప్పినందుకు నా అంగడి దగ్గరకు వచ్చారు. నా బియ్యాన్ని అధికారులకు పట్టించి నా పైనే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదు చేసి మానసిక క్షోభకు గురి చేశారు. ఎస్పీ సార్.. ఒక సామాన్య పేదవాడిగా ఈ వేధింపులు భరించడం నా వల్ల కావడం లేదు. నాకు చావే శరణ్యం అనిపిస్తుంది. నేను చనిపోతే నా భార్య బిడ్డల పరిస్థితి ఏమిటో అని భయంగా ఉంది. మీడియా ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముగ్గురు రిపోర్టర్లు, వారికి సహకరిస్తున్న హోంగార్డుపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాను. నేను మరణించేది ఎలాగో ఖాయం. కానీ నేను మరణించిన తర్వాత నా కుటుంబానికి నా భార్య పిల్లలకు న్యాయం జరగాలని కోరుతున్నాను.. అని నజీర్‌బాషా సూసైడ్ నోట్ రాసుకున్నాడు. ఈ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నజీర్‌బాషా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.


