ప్రొద్దుటూరు: పట్టణానికి చెందిన ప్రముఖ అవధాని డాక్టర్ నరాల రామారెడ్డికి మైసూరు తెలుగు సాంస్కృతిక సమితి వారు తెలుగు కోయిల ఉగాది విశిష్ట పురస్కారాన్ని ప్రకటించారు. ఈనెల 19న మైసూరులో పీడీ రెడ్డి భవనంలో మైసూరు తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో అవధాని నరాల రామారెడ్డి పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు సాహితీ వేత్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.
కడప ఎడ్యుకేషన్: కడపలోని పురుషుల ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి) ఆడిటోరియంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో మెటీరియల్స్, డివైజెస్ పై ఈ నెల 16న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.ఎం.రవి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత నిపుణులు, పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నట్లు చెప్పారు.ఈ సదస్సును వైవీయూ వీసీ రాజశేఖర్ , విక్రమ్ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాస్ రావ్ తదితరులు ప్రారంభిస్తారని తెలిపారు. కన్వీనర్ డా.బి.సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
కడప కార్పొరేషన్: రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఈనెల 17తో ముగియనున్న నేపథ్యంలో వాటికి ప్రత్యేక అఽధికారులను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కడప మున్సిపల్ కార్పొరేషన్‌కు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ప్రొద్దుటూరుకు జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనాలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అలాగే పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్ మున్సిపాలిటీలకు ఆయా డివిజన్ల ఆర్‌డీఓలను, మైదుకూరుకు కడప ఆర్‌డీఓను, యర్రగుంట్లకు కమలాపురం ఆర్‌డీఓను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరు ఆరునెలలు లేదా ఎన్నికలు జరిగే వరకూ ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులుగా విధులు నిర్వహిస్తారు.
నందలూరు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి హుండీని మంగళవారం లెక్కించగా రూ.1,98,200 వచ్చినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించామని పేర్కొన్నారు. వచ్చిన మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, విజిలెన్స్ అధికారి మల్లికార్జున, భక్తులు పాల్గొన్నారు.


