అధికారమున సమకూరుచుండు అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

అధికారమున సమకూరుచుండు అక్రమాలు

Mar 11 2026 7:47 AM | Updated on Mar 11 2026 7:47 AM

● వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ అయినా చర్యలు తీసుకునేనా?

ఎస్టీ మైదానంపై కూటమి క్రీ(నీ)డ!

టాస్క్‌ఫోర్స్‌: రాజంపేట మండలం మిట్టమీదపల్లె పొలం సర్వే నంబర్‌ 1066 పరిధిలోని చుండువారిపల్లెలో ఉన్న ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల కోసం ప్రభుత్వం 4 ఎకరాల క్రీడామైదానాన్ని కేటాయించింది. అయితే, ఈ స్థలంపై కన్నేసిన స్థానిక టీడీపీ నేత చుండు సుధీర్‌, నిరుపేద గిరిజన బిడ్డల భవిష్యత్తును కాలరాస్తూ ఆ భూమిని దర్జాగా ఆక్రమించారు. అక్కడ ఏకంగా ఫాంహౌస్‌ నిర్మించి, పండ్ల తోటలు సాగు చేస్తూ సొంత ఆస్తిలా అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి విలువ నాలుగు కోట్ట రూపాయలకు పైగా ఉంది. అంటే రూ. 16 కోట్ల ప్రభుత్వ ఆస్తి అన్యాక్రాంతమైంది.

కలెక్టర్‌ ఆదేశాలకే దిక్కులేదు!

ఈ కబ్జా వ్యవహారంపై గతంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వారికి పలువురు ఫిర్యాదులు చేశారు. స్పందించిన కలెక్టర్లు.. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రాజంపేట తహశీల్దార్‌ పీరుమున్నిని ఆదేశించారు. కానీ, సదరు తహశీల్దార్‌ కలెక్టర్‌ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా కబ్జాదారుడికి కొ మ్ముకాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పేదలపై ఉక్కుపాదం.. నేతలకు గులాంగిరీ?

తహసీల్దార్‌ పీరుమున్ని ద్వంద్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడైనా సామాన్యులు సెంటు స్థలంలో తలదాచుకోవడానికి చిన్న గుడిసె వేసుకుంటే చాలు.. అధికారుల బలగంతో వెళ్లి జులుం ప్రదర్శించే ఆమె, 4 ఎకరాల మైదానాన్ని కబ్జా చేసిన ‘పచ్చ’ నేతపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గిరిజన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ అండతోనే...

తెలుగుదేశం పార్టీ నాయకుడు, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గన్నే సుబ్బనరసయ్యనాయుడుకు చుండు సుధీర్‌ ముఖ్య అనుచరుడిగా ఉండటం వల్లే క్రీడామైదానం కబ్జాపై కలెక్టర్‌లకు ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజ లు విమర్శిస్తున్నారు. కోట్లాది రూపాయిల క్రీడామైదానాన్ని కబ్జా చేసినా అధికారులు చర్య లు తీసుకోలేక పోతున్నారంటే రాజంపేటలో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుకు, భూకబ్జాలకు ఇదో నిదర్శనంగా చెప్పవచ్చు.

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు

తినగ తినగ వేము తీయగనుండు

సాధనమున పనులు సమకూరు ధరలోన

విశ్వదాభిరామ వినుర వేమ.

భావం: పాడగా పాడగా రాగం వృద్ది అవుతుంది.తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది.అలాగే దృడ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చెయ్యగా అది తప్పకుండా సమకూరుతుంది. ప్రజాకవి వేమన రాసిన ఈ ప్రముఖ పద్యంలో మూడో పాదాన్ని కాస్త మార్చి... అధికారమున అక్రమాలు సమకూరు‘చుండు’ ధరలోన.. అని నవీకరించాల్సిన అవసరం ఆధునిక సమాజంలో కనిపిస్తోంది.

భావం: అధికారబలంతో చేపట్టిన అక్రమాలు అయినా తప్పకుండా సమకూరుతాయి..

గిరిజన విద్యార్థుల కోసం కేటాయించిన ఆటస్థలం కబ్జా

రూ. 16 కోట్ల విలువైన4 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా

స్కూల్‌ గ్రౌండ్‌లో టీడీపీ నేత‘చుండు సుధీర్‌’ ఫాంహౌస్‌ దర్జా!

గిరిజన ఆశ్రమ పాఠశాలకు కేటాయించిన క్రీడామైదానాన్ని టీడీపీకి చెందిన చుండు సుధీర్‌ కబ్జా చేసిన విషయాన్ని ఇటీవల వైఎస్సార్‌జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరికి కూడా ఆ ప్రాంతానికి చెందిన వారు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ శ్రీధర్‌ అయినా కబ్జాదారుడిపై చర్య లు తీసుకొని క్రీడామైదానం కబ్జాదారుడి చెర నుంచి విడిపిస్తారా? లేదా? వేచి చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement