బాణాసంచా నిల్వ కేంద్రాల్లో తనిఖీలు
కడప అర్బన్: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, వైఎస్‌ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా బాణాసంచా నిల్వ కేంద్రాల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు తని ఖీలు చేపట్టింది. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ జిల్లాలోని అన్ని సబ్–డివిజన్ల పరిధిలో తనిఖీ లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని డీఎస్పీల పర్యవేక్షణలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఫైర్, రెవెన్యూ శాఖల సమన్వయంతో జిల్లావ్యాప్తంగా లైసెన్స్ ఉన్న బాణాసంచా విక్రయాల గోడౌన్లు , దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
పరిశీలించిన అంశాలు:
ఎక్స్‌ప్లోజివ్ రూల్స్, పీఈఎస్‌ఓ (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోసివ్స్ అండ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ) నిబంధనల ప్రకారం చెల్లుబాటయ్యే నిల్వ లైసెన్స్‌లు ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. గోడౌన్లలో పరిమితికి మించి బాణాసంచా నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా స్పార్క్–ప్రూఫ్ సిస్టమ్స్, ఎర్తింగ్ సౌకర్యాలను తనిఖీ చేశారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: ఎస్పీ
‘జిల్లాలో ఎక్కడైనా అనధికారికంగా బాణాసంచా తయారు చేసినా లేదా నిల్వ ఉంచినా తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు.నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.


