ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్‌ భద్ర అడ్డుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్‌ భద్ర అడ్డుకోవాలి

Mar 2 2026 7:47 AM | Updated on Mar 2 2026 7:47 AM

ఆల్మట

ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్‌ భద్ర అడ్డుకోవాలి

ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్‌ భద్ర అడ్డుకోవాలి

సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమ నడిబొడ్డు నుంచి వైఎస్సార్‌సీపీ సమరభేరీ మోగించింది. క్షేత్రస్థాయి నుంచి నేతలు ప్రత్యక్ష పోరాటానికి సన్నద్ధమయ్యారు. రాయలసీమ జీవనాడీగా మారనున్న ఎత్తిపోతల పథకం కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఎగువ రాష్ట్రాలు చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మరణశాసనం లిఖిస్తున్న సీఎం చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి నేతృత్వంలో ఆదివారం కడపలోని మేడా కన్వెన్షన్‌ హాల్‌లో గ్రేటర్‌ రాయలసీమ పరిధిలోని 11 జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు హాజరై ముక్త కంఠంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతపై గళమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం నీటిని అంత్యంత వేగంగా తోడుకుంటుంటే ఆదేస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన ప్రాంతాల కోసం లిఫ్ట్‌ ప్రవేశ పెడితే స్వార్థ ప్రయోజనాల కారణంగా అడ్డుకున్నారని పలువురు వాపోయారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కే కాదు, జన్మనిచ్చిన రాయలసీమకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని పలువురు దెప్పి పొడిచారు.

రాయలసీమపై చిత్తశుద్ధి లేనిది ఎవరికీ?

రాయలసీమపై చిత్తశుద్ధి లేనిది ఎవరికీ అన్న పోస్టర్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆకట్టుకుంది. కృష్ణా, తుంగభద్ర బేసిన్‌ ఆధారంగా రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం వివరాలను బ్రిటీష్‌కాలం నుంచి 2019 వరకు ఎవరి హయాంలో రూపుదిద్దుకున్నాయో తెలియజేస్తూ వివరించారు. సర్‌ ఆర్థర్‌కాటన్‌, స్వర్గీయ ఎన్టీఆర్‌, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్లు కన్పించడం విశేషం. నాలుగు టర్మ్‌లు ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు పేరు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన ఖాతాలో లేకపోవడం విశేషం.

వాస్తవికతకు దర్పం పట్టేలా

శ్రీశైలం రిజర్వాయర్‌...

వైఎస్సార్‌పీపీ వాస్తవికతకు దర్పం పట్టేలా శ్రీశైలం రిజర్వాయర్‌ను వాటర్‌ కేన్‌ ద్వారా రూపొందించారు. 885 అడుగుల శ్రీశైలం పుల్‌ రిజర్వాయర్‌ వివరిస్తూనే, 841 అడుగులు వద్ద పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, 802 అడుగుల వద్ద కల్వకుర్తి, 800 అడుగుల వద్ద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను వివరిస్తూనే, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను తెలియజెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం లేకపోతే, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు లభించే ఆస్కారమే లేకుండా ఉన్న వివరాలను క్షుణ్ణంగా అర్థమయ్యేలా ఈ చిత్రపటాలు ఆకట్టుకున్నాయి.

సన్నద్ధులైన నేతలు

రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను సీనియర్లు సమగ్రంగా వివరించారు. గ్రేటర్‌ రాయలసీమకు ప్రాణపథమైన ఎత్తిపోతల పథకం సాధన కోసం 11 జిల్లాలకు చెందిన నాయకులు సన్నద్ధమయ్యారు. అందుకు కోసం క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రం నుంచి మొదలు పెట్టి గ్రామ స్థాయి వరకూ అంచెలంచెలుగా ప్రాజెక్టు ఆవశ్యకతను ప్రజలకు వివరించేందుకు కార్యోణ్ముఖులయ్యారు. తద్వారా సీఎం చంద్రబాబు సర్కార్‌ చేస్తున్న ద్రోహాన్ని వివరించి ప్రజల్ని చైతన్యవంతుల్నీ చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. ఆయా జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు, ఈకార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, డాక్టర్‌ సుధా, జడ్పీ ఛేర్మెన్‌ ముత్యాల రామగోవిందరెడ్డి, మేయర్‌ పాకా సురేష్‌, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఎస్‌బీ అంజాద్‌భాషా, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మాజీ మేయర్‌ సురేష్‌బాబు, డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, నగర కార్పోరేటర్లు, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, గురుమోహన్‌, సాయినాథశర్మ, మున్సిఫల్‌ ఛేర్మెన్లు రాజగోపాల్‌రెడ్డి, వరప్రసాద్‌, సంబటూరు ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హక్కుగా రావాల్సిన నీటినే

తీసుకోలేకపోతే ఎలా?:

గ్రేటర్‌ రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా దుర్భిక్షప్రాంతం. దివంగత వైఎస్సార్‌ సీఎం అయ్యాకే హంద్రీనీవా, జీఎన్‌ఎస్‌ఎస్‌, వెలిగొండ పూర్తి చేశారు. పోతిరెడ్డిపాడును 11వేల క్యూసెక్కుల నుంచి 44వేల క్యూసెక్కులకు పెంచారు. దానివల్లే రాయలసీమ ప్రాజెక్టులకు నీరు వస్తోంది. వైఎస్సార్‌ మరణం, రాష్ట్ర విభజన మనకు శాపంగా మారాయి. పవర్‌ జనరేషన్‌ పేరుతో తెలంగాణ ప్రతిరోజూ 8 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. చంద్రబాబు ఓటుకునోటు కేసులో ఇరుక్కుని పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ వదిలి వచ్చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా నోరు మెదపలేదు. రాయలసీమకు హక్కుగా రావాల్సిన నీటినే తీసుకోలేని పరిస్థితి ఉంటే ఎలా...? భవిష్యత్‌లో తీవ్ర కరువు వస్తే మన పరిస్థితి ఏంటి. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇక్కడి ప్రజలకు జీవనాడీ కానుంది.

–వైఎస్‌ అవినాష్‌రెడ్డి,

కడప పార్లమెంటు సభ్యులు

ఎత్తిపోతల పథకం అడ్డుకొని సీమ ఊసురు తీస్తారా?

క్షేత్రస్థాయి నుంచి ప్రత్యక్ష పోరాటానికి సన్నాహాలు

జన్మనిచ్చిన రాయలసీమకుతప్పని వెన్నుపోటు

మండిపడ్డ గ్రేటర్‌ రాయలసీమవైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం కడపలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశం మాజీమంత్రి సాకే శైలజానాథ్‌ ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. సీమ ఎత్తిపోతల పనులను పునఃప్రారంభించి పూర్తిచేయాలని, కర్ణాటక అక్రమంగా చేపట్టిన ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్‌ భద్ర ప్రాజెక్టులను అడ్డుకోవాలని, పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వచేసేలా పూర్తిచేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. ఆ మేరకు రౌండ్‌టేబుల్‌ సమావేశం ఆమోదించిన తీర్మానాలు ఇలా ఉన్నాయి..

దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఇన్స్యూరెన్స్‌ పాలసీ వంటిదైన రాయలసీమ ఎత్తిపోతల పనులను 90 శాతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిచేసింది. మిగిలిన పదిశాతం పనులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిచేసి రాయలసీమ ఎత్తిపోతల ఫలాలను రైతులకు అందించాలి. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా నీటిని తరలించే సామర్థాన్ని రోజుకు 3,850 క్యూసెక్కుల నుంచి 11,572 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టాలి.

కర్ణాటక ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.24 మీటర్లకు పెంచుతోంది. దీనివల్ల కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కులకు తీవ్రంగా విఘాతం కలుగుతుంది. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును అడ్డుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవడం, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయడం ద్వారా రాష్ట్ర హక్కులను పరిరక్షించాలి. కర్ణాటక సర్కార్‌ అక్రమంగా చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టు వల్ల హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. అప్పర్‌ భద్రను అడ్డుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 5న రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసి న్యాయపోరాటం చేసింది. ఆ పోరాటాన్ని కొనసాగించడం ద్వారా రాష్ట్ర హక్కులను పరిరక్షించాలి.

గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వచేసేలా అన్ని అనుమతులు తెచ్చి 2005లో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పనులు చేపట్టారు. అదేస్థాయిలో నీటిని నిల్వచేసేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పిల్‌వేతోపాటు సంక్లిష్టమైన పనులను పూర్తిచేసింది. కానీ నీటినిల్వ ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్‌ 2024 ఆగస్టు 28న తీర్మానించినా చంద్రబాబు సర్కార్‌ అభ్యంతరం చెప్పకపోవడం ద్వారా రాష్ట్ర హక్కులను ఫణంగా పెట్టింది. తక్షణమే పోలవరాన్ని 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వచేసేలా పూర్తిచేయాలి. కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణ కోసం 20 టీఎంసీలతో గుండ్రేవుల ప్రాజెక్టు తక్షణమే నిర్మించాలి.

రౌండ్‌టేబుల్‌ సమావేశంలోఏకగ్రీవంగా తీర్మానాలు

ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్‌ భద్ర అడ్డుకోవాలి 1
1/2

ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్‌ భద్ర అడ్డుకోవాలి

ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్‌ భద్ర అడ్డుకోవాలి 2
2/2

ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్‌ భద్ర అడ్డుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement