కరెంటు కోసం కర్షకుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

కరెంటు కోసం కర్షకుల ఆందోళన

Mar 2 2026 7:47 AM | Updated on Mar 2 2026 7:47 AM

కరెంటు కోసం కర్షకుల ఆందోళన

కరెంటు కోసం కర్షకుల ఆందోళన

ఎత్తిపోతల పథకం వద్ద

కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌

సొంత నిధులతో ట్రాన్స్‌ఫార్మర్‌

తెప్పించిన ఎంపీ

విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వకుండా

అధికారులు కాలయాపన

టీడీపీ నాయకుల ఒత్తిడే

కారణమంటున్న రైతులు

పులివెందుల/లింగాల : లింగాల మండలం ఎగువపల్లె సమీపంలోని బియాండ్‌ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకం సంప్‌నకు వెంటనే విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని ఐదు గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. ఎగువపల్లె గ్రామ సమీపంలోని భారీ సంప్‌ వద్దకు వారు ఆదివారం చేరుకుని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నెల క్రితం ఈ పథకానికి సంబంధించి భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. అయినా ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోలేదు. దీంతో సాగు, తాగునీరు అందే ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల, కోమన్నూతల, లోపట్నూతల గ్రామాల రైతులు ఆందోళన నిర్వహించి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా కూడా వారు స్పందించలేదు. దీంతో ఇటీవల మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన సందర్భంగా.. ఆయా గ్రామాల రైతులు తాగు, సాగునీటి సమస్యను ఆయనకు విన్నవించుకున్నారు. ఇందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి ఆయా గ్రామాల సమస్యలను పరిష్కరించేందుకు బియాండ్‌ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సూచించారు. దీంతో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌ను సొంత నిధులతో బియాండ్‌ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకం వద్దకు చేర్చడం జరిగింది. ఎంపీ ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌కు అధికారులు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడం లేదు. కేవలం టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడం లేదు.

సాగు, తాగునీరు అందక ఇక్కట్లు

ప్రస్తుతం నెల రోజులుగా నీరు రాకపోవడంతో అరటి పంటలు ఎండిపోతున్నాయని, అలాగే తాగడానికి నీరు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖల అధికారులు వెంటనే స్పందించి ఎత్తిపోతల పథకానికి విద్యుత్‌ కనెక్షన్‌ను ఏర్పాటు చేసి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. యుద్ధ ప్రాతిపదికన సాగు, తాగునీరు అందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ యర్రావుల పుష్ప, మల్లికార్జునరెడ్డి, నాగేంద్రనాథరెడ్డి, ఎ.వి.శ్రీనివాసులరెడ్డి, వెంగల్‌రెడ్డి, బాబా హుస్సేన్‌, గంగాధరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నాగేంద్రారెడ్డి, కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల, లోపట్నూతల, తాతిరెడ్డిపల్లె గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement