అంజన్న ఉత్సవాలకు వేళాయె
● రాతి ఆవకాయజాడీలో స్వామి ఆవిర్భావం
● కుంపిణీపురంలో 25 నుంచి ఉత్సవాలు
నందలూరు : రెండు శతాబ్దాల కిందట మంత్రాలయానికి చెందిన అప్పాచార్యుల స్వప్నంలో ఆంజనేయస్వామి సాక్షాత్కారమై.. తాను పలానచోట రాతి జాడిలో ఉద్భవించానని చెప్పారట.. ఆయన అక్కడి నుంచి అన్వేషించుకుంటూ కుంపిణీపురం (నందలూరు)లో జాగీర్దారులు నివసిస్తున్న ప్రాంతానికి చేరుకున్నారట. అప్పట్లో రాతి జాడీలను తయారు చేసుకొని అందులో ఆవకాయను నిల్వ చేసుకునేవారు. ఆ విధంగా లీలావాణికి చెందిన ఇంటిలో ఉన్న రాతిజాడీలో ఆంజనేయస్వామి ఉద్భవించినట్లుగా గుర్తించారు. అనంతరం ఆయన స్వామి వారిని ప్రతిష్టించారు. ఆలయ నిర్మాణం చేపట్టారు. మళ్లీ ఇక్కడి నుంచి మంత్రాలయం వెళ్లి అక్కడే సజీవ సమాధి అయ్యారు. దక్షిణాముఖంగా స్వయంభువుగా వెలసిన ఆంజనేయుడు ఇక్కడ ఉండటం ప్రత్యేక విశేషం.
ఈ నెల 25 నుంచి ఉత్సవాలు
మండలంలోని కుంపిణీపురం భోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుంచే కాక ఇతర జిల్లాల నుంచి భక్తులు రానున్నారు. జాగీర్‌దారుల ఆరాధ్య దైవమైన కుంపిణీపురం భోగాంజనేయస్వామి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 25వ తేదీ ఆదివారం రథసప్తమి నాడు ఉదయం ఉపనయనం, ఆస్థాన పూజలు, పంచామృతాబిషేకం, స్వామి వారికి ఆకుపూజ, 26న సోమవారం భీష్మాష్టమి నాడు ఉదయం స్వామి వారికి ప్రభాతసేవ, పంచామృతాభిషేకం, ఆకుపూజ, రాత్రి 9 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 27న ఉదయం ముగ్గుల పోటీలు, మధ్యాహ్నం కలశ పూజ, అనంతరం స్వామి వారి రథోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
బండలాగుడు పోటీలు
26వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బండలాగుడు పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలకు పలు ప్రాంతాల నుంచి ఎద్దులు రానున్నాయి. గెలుపొందిన వారికి మొదటి బహుమతి కింద రూ.60 వేలు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.40 వేలు, నాల్గో బహుమతి రూ.30 వేలు, ఐదో బహుమతి రూ.20 వేలు ఆరో బహుమతి రూ.10 వేలు, పోటీలలో పాల్గొన్న ప్రతి కాడెద్దులకు రూ.5 వేలు విలువ చేసే కన్సొలేషన్ బహుమతి అందజేస్తున్నట్లు నిర్వాహకులు సాయి ఆనంద్, కోనేటి నారాయణ, చింతకాయల నరసింహులు తెలిపారు.
కుంపిణీపురంలోని ఆంజనేయస్వామి ఆలయం ఆంజనేయస్వామి విగ్రహం
అంజన్న ఉత్సవాలకు వేళాయె


