బాబు పర్యటనతో ఒరిగిందేమీ లేదు
కడప కోటిరెడ్డిసర్కిల్: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. గురువారం కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. చీకటి దొంగ పర్యటనలా ఉందని ఎద్దేవా చేశారు. కొంతమంది వ్యక్తులను ఎంపిక చేసుకుని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారన్నారు. తన పర్యటనలో రైతులకు ఏమి చేయబోతున్నాడో చెప్పలేదన్నారు. మహానాడు కడపలో నిర్వహించినా జిల్లాకు ఒక్క పని చేసింది లేదని ధ్వజమెత్తారు. 15 రోజుల్లో ఉక్కు ఫ్యాక్టరీ పనులను ప్రారంభిస్తామని చెప్పి ఒక్క ఇటుక కూడా పెట్టిన పాపాన పోలేదని తూర్పారబట్టారు. చంద్రబాబు మాటలు తప్ప చేసింది శూన్యమేనని తెలిపారు. అర్హులైన ఏడు లక్షల మంది రైతులకు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు ఎగ్గొట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఒట్టి మాటలు కట్టి పెట్టి చేసే మేలు ఏమిటో చెప్పాలని నిలదీశారు. జిల్లాలో తుపాన్ కారణంగా నష్టపోతే రైతంగాన్ని ఆదుకున్న పాపాన పోలేదని తెలిపారు. వ్యవసాయం దండగా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాం లో ఏ సీజన్‌లో నష్టపోతే ఆ సీజన్‌లోనే రైతులను ఆదుకున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ‘అన్ని నేనే చేశానని నా వల్లే సాధ్యం అయింద’ని గొప్పలు తప్పా చంద్రబాబుతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మట్టి, ఇసుక మాఫియాను, కల్తీ మద్యాన్ని అరికట్టి గొప్పలు చెప్పినా ప్రజలు నమ్ముతారన్నారు. చంద్రబాబు జీవితంలో ఒక్క ప్రాజెక్ట్ కట్టిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. ఈవీఎంల ద్వారా గెలవడం తప్ప... .డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి మేలు జరిగిందేమీ లేదని ఆరోపించారు. పూటకో మాట మాట్లాడే ఆదినారాయణ రెడ్డిని ప్రజలు పట్టించుకోరని తెలియజేశారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు యానాదయ్య, పులి సునీల్‌కుమార్, కార్పొరేటర్ పాకా సురేష్, బీహెచ్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.
కొద్ది మంది వ్యక్తులను సెలక్ట్ చేసుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు
‘అన్నదాత సుఖీభవ’లో లక్షలాది మంది అర్హులకు కోత పెట్టారు
మీడియాతో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి


