మోసం చేయడం చంద్రబాబు నైజం
సిద్దవటం: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసే నైజం చంద్రబాబునాయుడుదని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొ న్నారు. సిద్ధవటం మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి ఆధ్వర్యంలో కనుములోపల్లెలోని మూలపల్లి గ్రామంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తన హయాంలో ప్రారంభించారన్నారు. అయితే చంద్రబాబునాయుడు వీటిని ప్రైవేటీకరణ చేసి నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరిస్తే పేద విద్యార్థులు, ప్రజలు నష్టపోతారని, అందువల్ల వైఎస్.జగన్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ కళాశాలలో విద్యను అభ్యసించాలని ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేశారన్నారు. దీంతో పేద విద్యార్థులు ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, అగ్రికల్చ ర్ విద్యను అభ్యసించారన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ సూపర్‌సిక్స్ పథకాలను కూడా అమలు చేస్తామని అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ఆకేపాటి అన్నారు. అంతకుముందు మూలపల్లి గ్రామంలో జెడ్పీటీసీ శ్రీకాంత్‌రెడ్డి ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండారెడ్డి, నాయబ్ పాల్గొన్నారు.
కోటి సంతకాల కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలి
వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి


