మైదుకూరులో ఇక నిరంతర నిఘా
కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన డీఐజీ కోయ ప్రవీణ్
మైదుకూరు: మైదుకూరు పట్టణంలో ఇక నుంచి నిరంతర నిఘా కొనసాగనుంది. స్థానిక పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్ (కమాండ్ కంట్రోల్)ను గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. కార్యాలయంలో రూ.25లక్షలతో ఏర్పాటైన 87 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ విభాగం, కాన్ఫరెన్స్ హాల్‌ను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఏఎస్పీ ప్రకాష్‌బాబు, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రనాథ్‌లతో కలిసి డీఐజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ కమాండ్‌కంట్రోల్ విభాగం నుంచి మైదుకూరు పట్టణంలో నిరంతరం నిఘా ఉంచి నేరాలను అదుపు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. దీని ఏర్పాటుకు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ తన వంతుగా రూ.20లక్షలు అందజేశారని, మున్సిపాలిటీ నిధుల నుంచి రూ.5లక్షలు అందించారని వివరించారు. కమాండ్ కంట్రోల్ ఏర్పాటుకు కృషి చేసిన డీఎస్పీ రాజేంద్రనాథ్, అర్బన్ సీఐ రమణారెడ్డి, ఎస్‌ఐలు చిరంజీవి, సుబ్బారావులను అభినందించారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది పరిమితిగా ఉంటారని, ఇలాంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పోలీసు విధులకు వెన్నుదన్నుగా నిలుస్తాయని తెలిపారు. నేరాలను అదుపు చేయడం కోసం నేరగాళ్లను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయుక్తం అవుతాయన్నారు. మైదుకూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు, మున్సిపల్ కమిషనర్ జి.రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.


