
పింఛన్ల తొలగింపుపై దివ్యాంగుల ధర్నా
పులివెందుల టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లు తొలగించినందుకు నిరసనగా దివ్యాంగుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పులివెందుల ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. అన్యాయంగా తొలగించిన అర్హులైన దివ్యాంగుల పింఛన్లు పునరుద్ధరించాలని కోరారు. కాళ్లు, చేతులు, కళ్లు కోల్పోయి దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్న దివ్యాంగుల పొట్టగొట్టి, సూపర్ సిక్స్ అంటూ ఇతర వర్గాలకు సొమ్ములను ధారపోయడం ఎంతవరకు సమంజసమన్నారు. తమ ఉసురు తప్పక తగులుతుందన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘాల ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులు శీలం సునీల్ కుమార్, రామకృష్ణ, చాగలేటి శివప్రసాద్, చాగలేటి ఉమాదేవి, రామససుబ్బయ్య, రామాంజనేయులు, ఈశ్వరయ్య, రవి, అశ్విని, స్వర్ణలత, తులసి, రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు.