
టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
● భూ వివాదంపై టీడీపీ మండల
అధ్యక్షుడిపై దాడి
● పోలీసు స్టేషన పక్కనే పరస్పరం
రాళ్లు రువుకున్న టీడీపీ నాయకులు
● ప్రేక్షక ప్రాత వహించిన పోలీసులు
పెండ్లిమర్రి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వాటాల కోసం.. భూ ఆక్రమణల కోసం నిత్యం కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ల మధ్యే వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా పెండ్లిమర్రి మండంలో వాటాల కోసం పోలీసుల ముందే ఇరువర్గాలు గొడవలకు దిగన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెండ్లిమర్రి మండల టీడీపీలో మంగళవారం వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడని టీడీపీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డిపై అదే పార్టీకి చెందిన టీడీపీ నాయకులు మల్లికార్జునరెడ్డి, సాంబశివారెడ్డి, శివారెడ్డి దాడి చేశారు. దాడిలో గంగిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. పెండ్లిమర్రి గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డికి కోరవాండ్లపల్లె బీసీ కాలనికి చెందిన యాదవులకు గత కొంత కాలం నుంచి భూవివాదం నడుస్తోంది. ఈ వివాదంలో టీడీపీ మండల అధ్యక్షుడు జోక్యం చేసుకుటున్నాడని అతనిపై దాడికి దిగారు. కొద్దిసేపటికి ఇరువర్గాల వారు అనుచరులను పిలుపించుకొని పోలీసు స్టేషన్ పక్కనే రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడుల్లో ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఇరువర్గాలు దాడులు చేసుకుంటున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ మిన్నకుండిపోయారు. గొడవ పూర్తిగా ముగిసిన తర్వాత పోలీసు బలగాలను పిలిపించి మమ అనిపించారు.