బాకీ చెల్లించలేదని దళిత యువకుడి హత్య | - | Sakshi
Sakshi News home page

బాకీ చెల్లించలేదని దళిత యువకుడి హత్య

Aug 27 2025 8:52 AM | Updated on Aug 27 2025 8:52 AM

బాకీ చెల్లించలేదని దళిత యువకుడి హత్య

బాకీ చెల్లించలేదని దళిత యువకుడి హత్య

దువ్వూరు : బాకీ చెల్లించలేదని దళిత యువకుడిని హత్య చేసిన ఘటన దువ్వూరు మండలం మదిరేపల్లె గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు మదిరేపల్లె గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పాలగిరి చెన్నయ్య (29) అదే గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి సంజీవరెడ్డి అనే వ్యక్తి వద్ద పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో అవసర నిమిత్తమై డబ్బు అప్పుగా తీసుకుని చెల్లించేవాడు. మూడు నెలల క్రితం సంజీవరెడ్డి నుంచి చెన్నయ్య రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. రెండు నెలల క్రితం తనకు అవసరం ఉందని డబ్బు ఇవ్వాలని సంజీవరెడ్డి అడుగగా తన వద్ద ఇప్పుడు డబ్బు లేదని చెప్పడంతో చెన్నయ్య, సంజీవరెడ్డి గొడవపడ్డారు. ఈ క్రమంలో ఈనెల 24న సాయంత్రం 4 గంటల సమయంలో చెన్నయ్య ఇంటి దగ్గరికి సంజీవరెడ్డి వచ్చి గుడిపాడు గ్రామంలో పని ఉంది పోయి వద్దాం రా అని పిలుచుకుని వెళ్లాడు. అదే రోజు రాత్రి చిన్నసింగనపల్లె – మనేరాంపల్లె మధ్యలో నారుపల్లె మోహన్‌రెడ్డి తోట వద్ద చెన్నయ్యపై సంజీవరెడ్డి విచక్షణా రహితంగా దాడిచేసి మోటార్‌ బైక్‌తో తొక్కించాడు. రాత్రి 9 గంటల సమయంలో చెన్నయ్య చిన్నాన్న కొడుకు పాలగిరి యోనాకు సంజీవరెడ్డి ఫోన్‌ చేసి మీ వాన్ని కొట్టిపడేసినా.. ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. చెన్నయ్య బంధువులు సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో చెన్నయ్య పడి ఉన్నాడు. వెంటనే వారు ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడి తీసుకెళ్లారు. రిమ్స్‌ నుంచి కర్నూలు తీసుకెళ్లగా అక్కడ పరిస్థితి విషమించండంతో తిరుపతి రుయా ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో చెన్నయ్య పలకకపోవడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి 11 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి చెన్నయ్య మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య శిరీష, ఇద్దరు కుమార్తెలు మహిమరాణి, మేఘన ఉన్నారు. విషయం తెలుసుకున్న మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చెన్నయ్య మృతదేహాన్ని పరిశీలించి, మండలంలోని మదిరేపల్లె గ్రామానికి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించి గ్రామస్తులను విచారించారు. ఈ సంఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, హత్య కేసు నమోదు చేశామని, నిందితుడు సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు దువ్వూరు ఎస్‌ఐ వినోద్‌ కుమార్‌ తెలిపారు. కుటుంబాన్ని పోషించే కొడుకు హత్యకు గురికావడంతో చెన్నయ్య తల్లిదండ్రులు, భార్యా, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement