
నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
కడప కార్పొరేషన్: దివ్యాంగుల పింఛన్లను రద్దు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. కడపలో దివ్యాంగ పింఛన్లు కోల్పోయిన వారు, సచివాలయ వెల్పేర్ సెక్రటరీ ద్వారా నోటీసులు అందుకున్న వారితో ఉదయం 9:30 నుంచి 12:00 గంటల వరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలోపార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ కే.సురేష్ బాబు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, జిల్లా, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, నగర కమిటీ, మండల జోన్ కమిటీల ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు.
రాజంపేట:సికింద్రాబాద్–తిరుపతి (07009/ 10) మధ్య నడుస్తున్న ప్రత్యేకరైలుకు రాజంపేటలో హాల్టింగ్ ఇస్తూ ఆదివారం దక్షిణమధ్యరైల్వే ఉత్తర్వులు విడుదల చేసింది. దీపావళి, దసరా పండుగలను పురస్కరించుకొని రద్దీని తగ్గించేందుకు ప్రత్యేకరైలును తీసుకొస్తున్నారు. వచ్చేనెల 4 నుంచి 25 వరకు ఈ రైలు నడుస్తుంది. నాలుగు సర్వీసులతో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు వయా కాచిగూడా, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్, ద్రోణాచాలం, ఎర్రగుంట్ల, కడప మీదుగా తిరుపతికి నడపనున్నారు.
కడప సెవెన్‌రోడ్స్: నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులు ఖచ్చితంగా ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత ఆదేశించారు. నగరంలోని ద్వారక ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ఆదివారం ఆమె తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించారు. రెస్టారెంట్‌లో వండిన చికెన్ బిర్యానీ తదితర వంటకాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. రెస్టారెంట్‌లో పరిశుభ్రత లోపించడంతో ఆమె యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. నిర్వాహకులు ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
కడప సెవెన్‌రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.
కాల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోండి
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు.
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వా రం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని వివరించారు.