
సర్టిఫికెట్ల పరిశీలన ఎప్పుడు!
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన డీఎస్సీ –25 మెరిట్ జాబితాను ప్రభుత్వం విడుదల చేయడంతో అభ్యర్థుల్లో మరో టెన్షన్ మొదలైయింది. ఎన్ని మార్కులకు కటాఫ్ అవుతుందనే టెన్షన్ అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులు, ర్యాంకులపై లెక్కలేసుకుంటున్నారు. రిజర్వేషన్లు, లోకన్, నాన్ లోకల్ అంచనాల్లో తలమునకలవుతున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ అభ్యర్థుల్లో ఏ కేటగిరిలో రోస్టర్ ఎక్కడ మొదలై ఎక్కడ ఆగిపోతుందనే దానిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా.. మెరిట్ జాబితా విడుదలయినా.. సెలక్షన్ జాబితాపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఆయా పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు నేరుగా మెసేజ్‌లు వెళతాయని అధి కారులు చెబుతున్నారు. మెరిట్ జాబితా తరహాలోనే సెలెక్షన్ జాబితాలు కూడా ప్రదర్శించాలని అభ్యర్థులు కోరుతున్నారు. మరోవైపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయంలో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 25 నుంచి వెరిఫికేషన్ ప్రారంభమవుతుందనే చర్చ సాగుతున్న నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులు కొంత ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కులం, ఆదాయ, స్టడీ తదితర సర్టిఫికెట్లు తెచ్చుకావాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని అభ్యర్థులు వాపోతున్నారు. దీనిపై డీఈఓతో మాట్లాడగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.
సర్టిఫికెట్ల పరిశీలనకు సిద్ధం..
ఉమ్మడిజిల్లాలో 705 పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలనకు కడప బాలాజీనగర్‌లోని యస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పోస్టులతోపాటు, జోనల్, రాష్ట్రస్థాయి పోస్టులకు ఎంపికై న జిల్లా అభ్యర్థులు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సర్టిఫికెట్ల వేరిఫికేషన్ కోసం 17 టీంలతోపాటు 30 మంది వలంటీర్లను సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. ఈ మేరకు వారికి శిక్షణ కూడా ఇచ్చారు. వీరంతా అభ్యర్థులకు సంబంధించి విద్యార్హత, కులం, ఆదాయం, స్థానిక ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు.