
ఘనంగా గంధోత్సవం
కడప సెవెన్‌రోడ్స్: కడప పెద్ద దర్గాలో ఆదివారం గంధోత్సవం ఘనంగా నిర్వహించారు. దర్గా 10వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా అమీనుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుస్సేనీ చిష్టి ఉల్ ఖాద్రి సాహెబ్ ఉరుసు ఉత్సవాన్ని మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. తొలి రోజున ఆదివారం గంధోత్సవంలో భాగంగా దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా మహమ్మద్ మహమ్మదుల్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ తన స్వగృహం నుంచి ఫకీర్ల మేళతాళాలతో గంధాన్ని తీసుకొచ్చారు. అనంతరం దర్గా గురువుల మజార్ వద్ద సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, ఫాతెహా చేశారు. హాజరైన భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉరుసు, మంగళవారం తహలీల్ ఫాతెహా నిర్వహించనున్నారు. ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనేందుకు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గురువుల ఆశీస్సులు పొందారు.