
ఖర్చును కంట్రోల్ చేద్దాం
● టోల్ గేట్ల ఫీజు బాధ తప్పినట్టే
● రూ.3000తో పొందే అవకాశం
● ఏడాది లేదా రెండు వందల ట్రిప్పులకు చెల్లుబాటు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జాతీయ రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు మనకు వివిధ ప్రాంతాల్లో టోల్ గేట్లు కనిపిస్తాయి. అక్కడ టోల్ చార్జి చెల్లించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నాలుగు చక్రాలు ఆపైన పెద్ద వాహనాలన్నీ ఈ టోలు కట్టాల్సిందే. మనం వెళ్లే దారిలో ఎన్ని చోట్ల టోల్ గేట్‌లు ఉంటే అక్కడ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్క ట్రిప్పునకు టోల్ గేట్ ఇరువైపులా కలిపి 90 రూపాయల నుంచి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇక నుంచి ఆ భారం లేకుండా జాతీయ ఉపరితల రవాణా సంస్థ (ఎన్‌హెచ్) స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఏడాది పాసు విధానం తీసుకు వచ్చింది. కార్లు, జీపులు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఒకసారి పాస్ తీసుకుంటే ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులకు అవకాశం ఉంటుంది. ఒక టోల్ గేట్ దాటితే ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు. ఆ దారిలో నాలుగు గేట్లు దాటి తిరిగి వెనక్కి వస్తే మొత్తం ఎనిమిది ట్రిప్పులు అయినట్టు లెక్క.
దేశవ్యాప్తంగా 1150 టోల్ గేట్లు..
గతంలో నగదు రూపంలో టోల్ ఫీజు వసూలు చేయగా తర్వాత ఫాస్టాగ్ వచ్చింది. దీని వల్ల టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ చాలా వరకు తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా సుమారు 1150 వరకు టోల్ గేట్లు ఉన్నాయని అంచనా. ఉమ్మడి వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 40 నెంబర్ జాతీయ రహదారిపై ఖాజీపేట మండలం దుంపలగట్టు వద్ద, రాయచోటి పరిధిలోని బండపల్లి వద్ద టోల్ గేట్లు ఉన్నాయి.
పాస్ పొందే విధానం..
ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్న వాహన యజమానులు తమ ఖాతా నుంచి ఫాస్టాగ్ పాస్ పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ పాస్ సొంత కార్లు, వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. బస్సులు, టాక్సీలు, లారీలు, రవాణా వాణిజ్య వాహనాలకు చెల్లదు. ట్రావెల్స్ వినియోగించే కార్లకు, జీపులకు కూడా వర్తించదు. ఈ ఫాస్టాగ్ ఏడాది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ రహదారులు జాతీయ ఎక్స్‌ప్రెస్ రహదారుల్లోని టోల్ ప్లాజాలలో పనిచేస్తుంది.
డిజిటల్ రూపంలోనూ..
ఫాస్టాగ్ ఏడాది పాస్‌ను డిజిటల్‌గా తీసుకోవచ్చు. రాజ మార్గ్ యాత్ర యాప్ సెల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని పొందవచ్చు. లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తుంది. దీనికోసం రూ. 3వేలు చెల్లించాలి. సంబంధిత వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. బ్లాక్ లిస్టులో ఉండకూడదు. సంబంధిత వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు నమోదు చేసుకోవాలి. రూ. 3వేలు చెల్లించిన తర్వాత ఏడాది పాస్ సంబంధిత వాహన ప్రస్తుత ఫాస్ట్ ట్రాక్ లింక్ అవుతుంది. ఈ పాస్ ఏడాదికాలం లేదా 200 ట్రిప్పులు మాత్రమే పనిచేస్తుంది. ఈ రెండింటిలో దీని గడువు ముందైనా ఇంకా పనిచేయదు. ఈ పాస్ వల్ల టోల్ చార్జీలు బాగా తగ్గుతాయి.
ఉపయోగాలు ఇవే..
కేంద్ర రవాణా ఉపరితల మంత్రిత్వ శాఖ ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్‌ను ప్రవేశపెట్టింది. జాతీయ రహదారిపై సొంత వాహనాల్లో ప్రయాణించే వారికి దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణంలో టోల్‌గేట్ భారం బాగా తగ్గించుకోవచ్చు.

ఖర్చును కంట్రోల్ చేద్దాం