
హైకోర్టు ఆదేశాలతో ఫిట్‌పర్సన్ బదిలీ
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఫిట్ పర్సన్ శంకర్‌బాలాజీని హైకోర్టు ఆదేశాలతో దేవదాయ శాఖ కమిషనర్ బదిలీ చేశారు. ఆయన స్థానంలో స్థానిక మఠం మేనేజర్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి 2021 సంవత్సరం మే 18న శివైక్యం చెందారు. మఠాధిపతి నియామకంలో మఠాధిపతి పెద్ద భార్య కుమారులు, రెండవ భార్య మధ్య వివాదం కావడంతో పరిపాలన వ్యవహారాల కోసం మఠాధిపతి స్థానంలో దేవదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న శంకర్‌బాలాజీని మఠం ఫిట్‌పర్సన్‌గా నియమించింది. దాదాపు మూడేళ్ల కాలంలో ఫిట్‌పర్సన్‌గా బి.మఠంలో రూ.10 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన చేస్తున్న కొన్ని పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పూర్వపు మఠాధిపతి రెండవ భార్య మారుతీ మహాలక్షుమ్మ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయనను బి.మఠం ఫిట్‌పర్సన్‌గా తొలగించాలని మారుతీ మహాలక్షుమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శంకర్‌బాలాజీని ఫిట్‌పర్సన్ బాధ్యతల నుంచి తొలగించాలని దేవదాయ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయనను బదిలీ చేసి మఠం మేనేజర్ ఈశ్వరాచారికి బాధ్యతలు అప్పజెప్పారు.