
‘అగ్నివీర్’కు 159 మంది అర్హత
తిరుపతి రూరల్ : అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ రాత పరీక్షలో ఎస్వీ డిఫెన్స్ అకాడమికి చెందిన 159 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆ అకాడమి చైర్మన్ బి.శేషారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చామని, వారు ఉద్యోగంలో చేరడానికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అర్హత సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
నేడు, రేపు కానిస్టేబుల్
అభ్యర్థుల పత్రాల పరిశీలన
కడప అర్బన్ : కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరైన అభ్యర్థుల్లో, సివిల్, ఏపీఎస్‌పీ, విభాగాల్లో తుది రాత పరీక్షలో ఎంపికై న పురుష, మహిళా అభ్యర్థులు ఈనెల 25, 26 తేదీలలో ఉదయం 9 గంటలకు సంబంధిత పత్రాలతో కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరు కావాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 25వ తేదీ హాల్‌టికెట్ నెంబర్ 4001160 నుంచి 4206930 వరకు, 26వ తేదీ హాల్‌టికెట్ నెంబర్ 4214369 నుంచి 4504602 వరకు అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు.
రెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం ఉదయం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు.
భూ వివాదంలో వ్యక్తిపై దాడి
మదనపల్లె రూరల్ : భూ వివాదం కారణంగా దాయాదుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. మాలేపాడు పంచాయతీ దొనబైలుకు చెందిన కట్టప్ప కుమారుడు నాగరాజు(45) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతను వ్యవసాయం చేస్తున్న పొలానికి సంబంధించి గత కొంత కాలంగా దాయాదులతో వివాదం ఉంది. ఈ క్రమంలో ఆదివారం దాయాదులైన చంద్ర, మల్లికార్జున, విశ్వనాథ్ గొడవకు దిగారు. నాగరాజును కర్రలతో కొట్టారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.