
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని వసంతపేటలో ఉమ్మడిశెట్టి లక్ష్మీప్రసాద్ (34) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు ఉమ్మడిశెట్టి వెంకటసుబ్బన్న వస్త్ర దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. అతనికి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో చిన్న కుమారుడైన ఉమ్మడిశెట్టి లక్ష్మీప్రసాద్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. రెండేళ్ల క్రితం ఎర్రగుంట్లకు చెందిన చంద్రకళ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతితో వివాహమైంది. పెళ్‌లైన వారం రోజుల నుంచే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. పెద్దలు పంచాయతీ చేసినా వారి మధ్య సఖ్యత కుదరలేదు. గతంలో లక్ష్మీప్రసాద్ హైదరాబాద్‌లో ఆత్మహత్యా యత్నం చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతని కిడ్నీ చెడిపోవడంతో డయాలసిస్ చేయిస్తున్నారు. తన ఆరోగ్యం కుదుట పడలేదని, చనిపోవాలనిపిస్తోందని అతను తల్లిదండ్రులతో చెప్పగా వారు ధైర్యం చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 22న అతను హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు వచ్చాడు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అతను మిద్దైపెకి వెళ్లి పడుకున్నాడు. రాత్రి పొద్దుపోయాక కుటుంబ సభ్యులు చూడగా లక్ష్మీప్రసాద్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి వెంకటసుబ్బన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.