
స్నేహితుల మధ్య ఘర్షణ
కమలాపురం : కమలాపురం మండలం రామచంద్రాపురం వద్ద స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణగా మారింది. ఈ నేపథ్యంలో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కమలాపురం మండలం చదిపిరాళ్లకు చెందిన శివారెడ్డికి, వల్లూరు మండలం పెద్దపుత్తకు చెందిన గోవర్ధన్ రెడ్డి రూ.4500 బాకీ ఉన్నాడు. ఆ డబ్బు సోమవారం ఇస్తానని చెప్పడానికి ఆదివారం గోవర్ధన్ రెడ్డి రామచంద్రాపురం వద్ద ఉన్న శివారెడ్డి వద్దకు వెళ్లాడు. అయితే తనకు ఇప్పుడే కావాలని శివారెడ్డి చెప్పాడు. ఈ నేపథ్యంలో కట్ట గ్రామానికి చెందిన ఆది, నాగరాజు, వినోద్, చరణ్ తేజ్‌తో పాటు మరి కొందరు రామచంద్రాపురం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏమి జరిగిందో తెలియదు గాని స్నేహితులైన గోవర్ధన్ రెడ్డి, నాగరాజు మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో నాగరాజుపై గోవర్ధన్ రెడ్డి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నాగరాజుకు గొంతు వద్ద తీవ్ర గాయమైంది. వెంటనే అతన్ని కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తీసుకెళ్లారు. కాగా జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
కత్తితో దాడి–గాయాలు