డ్వాక్రా సంఘాల పర్యవేక్షణ బాధ్యత ఎవరిది? | - | Sakshi
Sakshi News home page

డ్వాక్రా సంఘాల పర్యవేక్షణ బాధ్యత ఎవరిది?

Aug 24 2025 7:33 AM | Updated on Aug 24 2025 7:33 AM

డ్వాక్రా సంఘాల పర్యవేక్షణ బాధ్యత ఎవరిది?

డ్వాక్రా సంఘాల పర్యవేక్షణ బాధ్యత ఎవరిది?

●ఆర్పీలు ఎందుకు పట్టించుకోవడం లేదు

లక్షల రూపాయల డబ్బులు

స్వాహా చేసినట్లు ఆరోపణలు

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో

వెలుగు చూస్తున్న పర్యవేక్షణ లోపాలు

ప్రొద్దుటూరు : డ్వాక్రా సంఘాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులను నియమించింది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వివిధ హోదాల్లో అధికారులు పనిచేస్తున్నారు. వేతనాలతోపాటు కమీషన్లను దండుకుంటున్నారు. అయినా తరచూ డ్వాక్రా సంఘాల నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తద్వారా డ్వాక్రా సభ్యులు నష్టపోతున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి మెప్మా పరిధిలో 2814 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు సంబంధించి ప్రతి నెల వేతనాలు తీసుకునే ఆర్పీలు, సీఓలతోపాటు మున్సిపాలిటీకి సంబంధించి ప్రత్యేక అధికారి ఉన్నారు. ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా డ్వాక్రా సంఘాలకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. వివిధ రకాలుగా సహాయ సహకారాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా అందిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల రుణమాఫీ (వైఎస్సార్‌ ఆసరా), రుణాల వడ్డీ మాఫీ పథకాన్ని అమలు చేశారు.

ఇలా చేయాలి..

ప్రతి నెలా కింది స్థాయిలో ప్రతి డ్వాక్రా గ్రూప్‌కు సంబంధించి ఆర్పీ ఆధ్వర్యంలో సభ్యుల సమావేశాన్ని నిర్వహించాలి. గత నెలలో జరిగిన వివరాలను చర్చించడంతోపాటు బ్యాంకులకు డబ్బు జమ చేసిన రశీదులను తీర్మానంలో పొందుపరచాలి. ఆర్పీతోపాటు గ్రూప్‌ లీడర్లు, సభ్యులు తీర్మానంలో సంతకాలు చేయాలి. ప్రతినెలా ఆర్పీ పది మంది సభ్యులను హాజరుపరిచి పొదుపు, అప్పు, వడ్డీ వివరాలను వివరించాలి. ప్రతినెలా ఒక్కో సభ్యురాలు బ్యాంక్‌కు వెళ్లి కంతుల డబ్బును చెల్లించాలి. చెల్లించిన రశీదులను మరుసటి నెలలో నిర్వహించే సమావేశం తీర్మానం పేజీలో అతికించాలి. తీర్మానంలోనే గ్రూప్‌ సభ్యులు ఇప్పటి వరకు ఎంత డబ్బు చెల్లించారు అనే వివరాలను రాయాల్సి ఉంటుంది. ఇంత పకడ్బందీగా ఆర్పీ గ్రూప్‌లను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి నెలా ఆర్పీలకు సంబంధించి ఎస్‌ఎల్‌ఎఫ్‌ సమావేశాన్ని సీఓ నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ప్రతి గ్రూపు నుంచి ఒక లీడర్‌, ఒక సభ్యురాలు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కింది స్థాయిలోనే పర్యవేక్షణ గాడి తప్పిందనేదానికి ఉదాహరణ ఇది.

పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన నూరె షబా డ్వాక్రా గ్రూప్‌కు సంబంధించి వెలుగు చూసిన సంఘటన. లక్షల రూపాయలను లీడర్లు స్వాహా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంత అనే విషయం అలా ఉంచితే డ్వాక్రా సంఘాల్లో ఈ సమస్య హాట్‌ టాపిక్‌గా మారింది. గత సోమవారం బ్యాంక్‌ అధికారులు, మెప్మా అధికారులు శ్రీనివాసనగర్‌లోని డ్వాక్రా గ్రూప్‌ లీడర్ల ఇళ్ల వద్దకు వెళ్లగా వారు ఇంటికి తాళాలు వేసిన విషయాన్ని గుర్తించారు. తర్వాత లీడర్ల కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడారు. ఏడాదిగా డ్వాక్రా సభ్యులకు సంబంధించిన సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా వాడుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఏడాది కాలంగా డబ్బు దుర్వినియోగం అయి ఉంటే ఎందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఆర్పీ ప్రతినెలా సభ్యులతో సమావేశం నిర్వహించి యాప్‌లో ఫొటోతోపాటు గ్రూప్‌ సభ్యుల తీర్మానం పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. సక్రమంగా కంతులు చెల్లించకపోతే బ్యాంక్‌ అధికారులు ఇంత కాలం ఎందుకు చర్యలు తీసుకోలేదు. పైగా ప్రతి ఏడాది ప్రతి గ్రూప్‌కు సంబంధించి అధికారులు ఆడిట్‌ చేయిస్తున్నారు. గత ఏడాది ఆడిట్‌లో ఈ విషయాలు వెలుగు చూడలేదా, అసలు ఆడిట్‌ చేయించలేదా అనే ప్రశ్న తలెత్తుతోంది.

పోలీస్‌ స్టేషన్‌కు చేరిన పంచాయితీ

నూరె షబా స్వశక్తి సంఘంలో జరిగిన అవకతవకలపై సభ్యులు నాలుగు రోజుల క్రితం టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.

డ్వాక్రా సంఘాల నిర్వహణ గురించి మున్సిపాలి టీలో కొంత మంది ఆర్పీలు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రతినెల డ్వాక్రా గ్రూప్‌కు సంబంధించి పుస్తకాలు రాసేందుకు కొంత మంది ఆర్పీలు రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తున్నారు. అలాగే బ్యాంక్‌ లోన్‌ ఇప్పించిన సందర్భాల్లో 5 శాతం చొప్పున కమీషన్‌ వసూలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఇవే కాకుండా గ్రూప్‌ సభ్యులను ఆసరాగా చేసుకుని సొంత వ్యాపారాలు చేస్తున్నారు. నూరె షబా స్వశక్తి సంఘంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మెప్మా టీఈ మహాలక్ష్మిని వివరణ కోరగా సోమవారం గ్రూప్‌ లీడర్ల ఇళ్ల వద్దకు వెళ్లిన మాట వాస్తవమేనన్నారు. ఎంత డబ్బు వాడుకున్నారనే విషయంపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపామన్నారు. గ్రూప్‌ లీడర్లను వివరణ కోరగా తమ గ్రూప్‌కు సంబంధించిన తీర్మానం బుక్‌లతోపాటు బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు ఆర్పీ దగ్గరే ఉన్నాయని తెలిపారు. నాలుగు రోజుల క్రితం పాస్‌ పుస్తకాలను తమకు ఇచ్చారన్నారు. ప్రతి విషయాన్ని తాము ఆర్పీకి ఎప్పటికప్పుడు తెలియజేశామని పేర్కొన్నారు. స్థానిక అధికారులను కాకుండా ప్రత్యేక అధికారులచేత విచారణ చేయిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement