
స్ఫూర్తి ప్రదాత ప్రకాశం పంతులు
కడప సెవెన్‌రోడ్స్ : స్వాతంత్య్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి ప్రదాత అని, భవిష్యత్ తరాలకు ఆదర్శ ప్రాయులని నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పని చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టి, కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు. ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం పంతులు ఒకరని తెలిపారు. ఆయన పేరు మీద రాజమండ్రిలో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారని, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ప్రకాశం పంతులు అని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, న్యాయవాదిగా, రాజకీయ వేత్తగా, రచయితగా, సంపాదకుడిగా రాణించి ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తి తీసుకొచ్చారని కొనియాడారు. యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ కిరణ్ కుమార్, స్టెప్ సీఈఓ సాయి గ్రేస్, ఐసీడీఎస్ అధికారి రమాదేవి పాల్గొన్నారు.
ఆంధ్ర కేసరికి ఘన నివాళి
కడప అర్బన్: శ్రీఆంధ్ర కేసరిశ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని శనివారం కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్. అదనపు ఎస్.పి. బి.రమణయ్య ప్రకాశం పంతులు చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన త్యాగాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ఎ.ఆర్. డీఎస్పీ శ్రీనివాస రావు, డీపీఓ ఏ.ఓ కె.వెంకటరమణ, ఆర్.ఐ లు వీరేష్, టైటస్, శివరాముడు, శ్రీశైల రెడ్డి, ఆర్.యస్.ఐ లు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి
ప్రకాశం పంతులు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఏ.ఆర్. అదనపు ఎస్పీ

స్ఫూర్తి ప్రదాత ప్రకాశం పంతులు