
దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు దారుణం
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరిట తొలగిస్తుండటం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా విమర్శించారు. ఇది ఏమాత్రం మానవత్వం లేని ప్రభుత్వమని ధ్వజమెత్తారు. శనివారం కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచానికే పరిమితమైన వారు, తలసేమియాతో బాధపడుతున్న వారు, డయాలసిస్ బాధితులు, వికలాంగులకు ఎన్నో ఏళ్లుగా పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ప్రజలకు చేసిన మేలు ఏదీ లేకపోగా పెన్షన్లు తొలగిస్తోందని విమర్శించారు. తాము రూ. 3 వేలు ఉన్న పెన్షన్ రూ. 4 వేలకు పెంచామని ఓవైపు గొప్పలు చెప్పుకుంటూ మరోవైపు కోత విధిస్తున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం నుంచి దిగిపోయే సమయానికి రాష్ట్రంలో 66,34,000 పెన్షన్లు ఉన్నాయని, బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 62,19,000కు తగ్గిపోయాయని పేర్కొన్నారు. అంటే సుమారు 4.50 లక్షల పెన్షన్లు తొలగించారని తెలిపారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో 3,160 దివ్యాంగ పెన్షన్లు ఉండగా, ప్రస్తుతం రీ వెరిఫికేషన్ పేరిట ఆగస్టు నెలలోనే 634 మందికి తొలగిస్తూ నోటీసులు జారీ చేశారన్నారు. రాష్ట్రంలో లక్ష పైబడి వికలాంగుల పేర్లతో దొంగ పెన్షన్లను పొందుతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌లు మాట్లాడటం అన్యాయమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అర్హత లేకున్నా మంజూరు చేసిన బోగస్ పెన్షన్లను మాత్రమే తొలగిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం నిజం లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విపరీతంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నారంటూ నాడు చంద్రబాబు విమర్శించారన్నారు. జగన్ హయాంలో 3 లక్షల 33 వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. చంద్రబాబు 14 నెలలకే లక్షా 87 వేల కోట్లు అప్పులు తీసుకొచ్చినా సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని, మిగతా డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయని ప్రశ్నించారు. కార్పొరేటర్ షఫీ, నాయకులు దాసరి శివ, శ్రీరంజన్‌రెడ్డి, సీహెచ్ వినోద్‌కుమార్, టక్కోలు రమేష్‌రెడ్డి, తోట కృష్ణ, బసవరాజు, గౌస్‌బాషా, మునిశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా