
గండి క్షేత్రంలో ముగిసిన శ్రావణ మాస ఉత్సవాలు
అమావాస్య కారణంగా
చివరి శనివారం భారీగా తగ్గిన భక్తుల రద్దీ
చక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో శ్రావణ మాసం చివరి శనివారం భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. ఇందుకు అమావాస్యే కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని పరవశించి పోయారు. వాహనాలను పోలీసులు అద్దాలమర్రి క్రాస్, ఇడుపులపాయ క్రాస్‌ల వద్దనే నిలిపి వేశారు. దీంతో భక్తులు కాలినడకన గండికి చేరుకొని దర్శించుకున్నారు. కొందరు భక్తులు వేంపల్లె, చక్రాయపేట, నాగలగుట్టపల్లె, వేముల తదితర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల కోసం గండి శ్రీవాసవీ నిత్యాన్నదాన సత్రంతో పాటు పలు చోట్ల దాతలు పెద్ద ఎత్తున అన్నదానాలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య చైర్మన్ కావలి కృష్ణతేజ, పాలకమండలి సభ్యులతో పాటు ఆర్కేవ్యాలీ సీఐ ఉలసయ్య, ఆర్కేవ్యాలీ ఎస్‌ఐ రంగారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు రాజారమేష్, రాజగోపాలాచార్యులు, రఘుస్వామి, వేద పారాయణం రామ మోహనశర్మలు స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు.
వైభవంగా స్వామి వారి క్షేత్రోత్సవం, ఆస్థానం
శ్రావణ మాసం ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారి క్షేత్రోత్సవం, ఆస్థానం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పల్లకిలో పూలాలంకరణ మధ్య ఉత్సవ మూర్తి విగ్రహాన్ని ఉంచి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. అనంతరం ఆస్థానం నిర్వహించి ఈ ఏడాది శ్రావణ మాస ఉత్సవాలను ముగించారు.