
ఎమ్మార్పీ ధరకంటే అధికంగా అమ్మితే చర్యలు
ప్రొద్దుటూరు : ఎమ్మార్పీ ధరకంటే ఎక్కువ ధరకు యూరియా అమ్మితే వ్యవసాయ శాఖ తీసుకునే చర్యలకు వ్యాపారులు సిద్ధంగా ఉండాలని, దుకాణాల వద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు చంద్రానాయక్ తెలిపారు. ఆయన శనివారం ప్రొద్దుటూరులోని పలు ఎరువుల దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూరియా బస్తా రూ.266.50 చొప్పున మాత్రమే అమ్మాలని తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. యూరియా నిల్వలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ, పోలీసులతో కలసి విజిలెన్స్ మానిటరింగ్ టీంను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ అనిత, సీఐ వేణుగోపాల్, డీసీటీఓ ఖాజామొహిద్దీన్, ఏఓ వరహరికుమార్ పాల్గొన్నారు.
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్
అధికారుల ఆకస్మిక తనిఖీ
మైదుకూరు : మైదుకూరులోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్, వ్యవసాయాధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రికార్డుల్లో తేడాలు ఉండటంతో పలు దుకాణాల యాజమానులకు నోటీసులిచ్చారు. పట్టణంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఫెర్టిలైజర్స్, శ్రీసాయి లక్ష్మీ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాల్లో రికార్డులను, ఎరువుల ధరలు ఎమ్మార్పీ ముద్రణ విషయాలను పరిశీలించారు. స్టాక్ రికార్డుల్లో తేడాలు ఉండటంతో దుకాణ యాజమానులకు అమ్మకాలను నిలిపేస్తూ నోటీసులిచ్చారు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఫెర్టిలైజర్స్ దుకాణంలో రూ.53,385 విలువైన 9.41 టన్నుల యూరియా, శ్రీసాయి లక్ష్మీ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దుకాణంలో రూ.53,300 విలువైన 10 టన్నుల యూరియాను అమ్మకూడదని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.