
టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడు
– వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం
జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి
కడప కార్పొరేషన్ : తిరుమల, తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడని వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. శనివారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదివరకు వైవీ సుబ్బారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, ఆదికేశవులు నాయుడు, భూమన కరుణాకర్‌రెడ్డిలాంటి వారు టీటీడీ చైర్మన్లుగా ఉండి పార్టీలకతీతంగా దైవభక్తితో సేవ చేశారన్నారు. ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయాలు మాట్లాడుతూ, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆయన చైర్మన్‌గా ఎంపికై న నాటి నుంచి ఏదీ కలిసి రావడం లేదని, కల్తీ లడ్డు వ్యవహారం దేశాన్ని కుదిపేసిందని, టికెట్ల విక్రయాల్లో గోల్‌మాల్, దర్శనం సమయంలో తోపులాటలో ఆరుగురు భక్తులు చనిపోయారని, అన్నప్రసాదాల్లో జెర్రి రావడం, గోవులకు సరైన వైద్యం, ఆహారం అందించకుండా 191 గోవులు చనిపోవడానికి కారణమయ్యారన్నారు. ఈ వరుస సంఘటనల వల్ల ఏం చేయాలో దిక్కుతెలియక వైఎస్ జగన్‌కు దైవభక్తి లేదని, భారతీరెడ్డి తలనీలాలు సమర్పించాలని మాట్లాడుతున్నారన్నారు. లోకేష్ సతీమణి, నారా భువనేశ్వరి ఏమైనా తలనీలాలు సమర్పించారా అని ప్రశ్నించారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు షేక్ షఫీ పాల్గొన్నారు.