
ఎరువులు అందుబాటులో ఉన్నాయి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో యూరియా లభ్యతపై జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆర్‌ఎస్‌కేలలో 3700 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేట్ ఎరువుల డీలర్స్ నిబంధనల ప్రకారం మాత్రమే ఎరువులను విక్రయించాలన్నారు. బల్క్‌స్టాక్ పెట్టుకుని కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు. డీలర్స్ రైతుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని అనవసరమైన వేరే ఉత్పత్తులను, పోషకాలను లింక్ చేసి అమ్మితే చర్యలు తీసుకొని, వారి లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆర్‌ఎస్‌కేలలో, ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులలో యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎక్కడైనా యూరియా కొరత ఏర్పడితే 24 గంటల్లో దగ్గర ఉన్న ఆర్‌ఎస్‌కే ద్వారా అందజేస్తామని తెలిపారు. రైతుల సహాయార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైతే కంట్రోల్ రూమ్ నెంబర్లు 8331057300, 9491940106, 8919081933 లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ చంద్రా నాయక్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి శ్రీనివాసరావు తదతరులు పాల్గొన్నారు.
బ్రహ్మంసాగర్ పరిశీలన
బ్రహ్మంగారిమఠం: తెలుగు గంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్‌ను శుక్రవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరు, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఇన్‌చార్జి ఎస్‌ఈ వెంకటరామయ్యలు పరిశీలించారు. సాగర్ లో నీటిమట్టం , ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో , కుడి, ఎడమ కాలువలు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌తో కలిసి సాగునీటి కాలువలకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. సాగర్ ఆయకట్టు వివరాల గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాగర్‌కు నీరు వస్తుంది కానీ తగిన ఆయకట్టుకు నీరు సరిగా అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసం పంట కాలువలు తప్పనిసరిగా ఉండాలని అధికారులకు తెలిపారు. ఇందుకోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, బద్వేల్ డివిజన్ ఈఈ మధు సూదన్ రెడ్డి, డీఈఈలు, ఏఈఈలు, తహసీల్దార్ కార్తీక్, ఇన్‌చార్జి ఎంపీడీఓ వీరకిషోర్, డీటీ జాన్స్, బి.మఠం సింగల్ విండో అధ్యక్షుడు నేలటూరు సాంబశివారెడ్డి పాల్గొన్నారు.
రైతు సేవా కేంద్రం తనిఖీ
బ్రహ్మంసాగర్ పరిశీలన అనంతరం బద్వేల్‌కు వెళ్లే దారిలో ఉన్న చౌదరవారిపల్లె రైతు సేవాకేంద్రంను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరు తనిఖీ చేశారు. అనంతరం చౌదరవారిపల్లె, జి,నరసింహపురం రైతులతో మాట్లాడారు. యూరియా కోసం వచ్చిన రైతులు వ్యవసాయ సమస్యలను వివరించారు. యారియా కొరతలేకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రానాయక్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి