
రూ.10 కోట్లకు వ్యాపారి ఐపీ
ముద్దనూరు: మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోట్లాది రూపాయలు అప్పులు చేసి ఐపీ పెట్టినట్లు సమాచారం. మెడికల్ ఏజన్సీ వ్యాపారం నిర్వహిస్తూ పలువురి వద్ద భారీగా సదరు వ్యక్తి అప్పులు చేసినట్లు తెలుస్తోంది. గత వారం రోజుల నుంచి ఈ వ్యాపారి కోట్లాది రూపాయలకు ఐపీ పెట్టినట్లు బాధితులకు తెలియడంతో పలువురు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. మెడికల్ ఏజన్సీ నిర్వహిస్తూ సుమారు రూ.10ల వడ్డీకి కూడా అప్పులు తీసుకున్నట్లు, దీంతో అప్పులు అధికమైనట్లు వినికిడి. ఐపీ పెట్టిన వ్యక్తికి విజయవాడ, అనంతపురం, కడప, తాడిపత్రి, ముద్దనూరు మండలాలకు చెందిన సుమారు 20 మంది వరకు అప్పులు ఇచ్చినట్లు, ఇతను సుమారు రూ.10 కోట్ల మేర అప్పులు చేసినట్లు ప్రస్తుతానికి బయటపడినట్లు తెలుస్తోంది. భారీగా అప్పులు చేసి ఐపీ పెట్టిన సమాచారం అందడంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు.
మదనపల్లె సిటీ: మదనపల్లె పట్టణ సమీపాన ఉన్న పుంగనూరురోడ్డులోని గ్రీన్‌వ్యాలీ పాఠశాలలో ఈ నెల 24న జిల్లా బాల,బాలికల షూటింగ్‌బాల్ జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఆమె పేర్కొన్నారు. 2006 ఏప్రిల్ 1 తరువాత పుట్టినవారు అయి ఉండాలన్నారు. ఆధార్‌కార్డు తీసుకుని రావాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ : 6281881022ను సంప్రదించాలని వివరించారు.
రాయచోటి జగదాంబసెంటర్: విద్యార్థుల్లో కళాత్మక నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా 12 అంశాలతో కళా ఉత్సవ్ – 2025 పోటీలు నిర్వహిస్తున్నట్లు కళా ఉత్సవ్ జిల్లా నోడల్ అధికారి మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. స్థానిక డైట్ కళాశాలలో కళా ఉత్సవ్ – 2025కు సంబంధించిన రిజిస్ట్రేషన్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, సంప్రదాయ కథ చెప్పడం వంటి 12 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలోని 50 మండలాలకు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 9, 10, 11, 12వ తరగతుల విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని వివరించారు. పోటీల్లో పాల్గొనే వారు రాయచోటి డైట్ కళాశాలలో వ్యక్తిగతంగా గానీ 9440246825 నంబర్‌కు వాట్సాప్ ద్వారా గానీ, గూగుల్ ఫామ్ ద్వారా గానీ తమ పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు.