
కూల్చిన డాబాను పరిశీలించిన బలిజ సంఘం నాయకులు
దువ్వూరు : మండలంలోని ఇడమడక గ్రామంలో జాతీయ రహదారి సమీపంలో ఉన్న నగరి శ్రీకాంత్ డాబాను సోమవారం ఉదయం రెవెన్యూ, పోలీసు అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారు. విషయం తెలుసుకున్న బలిజ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు తిరుమలశెట్టి రెడ్డిశేఖర్ రాయల్, రాయలసీమ అధ్యక్షుడు సమతం రాము గురువారం కూల్చిన డాబాను పరిశీలించారు. అనంతరం శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 ఏళ్లుగా శ్రీకాంత్ ఈ డాబాను నిర్వహిస్తున్నాడని, ఏ శాఖకు అభ్యంతరం లేనిది కేవలం అధికార పార్టీ నాయకులకే డాబా అడ్డం వచ్చిందా అని ప్రశ్నించారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు.