అందని లైసెన్సు కార్డులు.. తప్పని అవస్థలు! | - | Sakshi
Sakshi News home page

అందని లైసెన్సు కార్డులు.. తప్పని అవస్థలు!

Aug 22 2025 3:28 AM | Updated on Aug 22 2025 3:28 AM

అందని

అందని లైసెన్సు కార్డులు.. తప్పని అవస్థలు!

రోడ్డెక్కిన వాహనదారులను దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం మాస్టర్‌ స్కెచ్‌ వేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డులు జారీ చేయకుండా చలానా పేరుతో కోట్లు దోపిడీ చేస్తోంది. డిజిటల్‌ టెక్నాలజీకి తానే ఆద్యుడునని చెప్పుకునే సీఎం చంద్రబాబు తిరిగి ఫిజికల్‌ విధానాన్ని అమలులోకి తెచ్చారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వాహనదారులకు కార్డుల భారం లేకుండా డిజిటల్‌ విధానాన్ని అమలు చేశారు. ఫిజికల్‌ కార్డు లేకపోయినా యాప్‌ ఓపెన్‌ చేసి చూపించినా సరిపోయేది. కూటమి ప్రభుత్వం వచ్చి దోపిడీకి తెర తీసింది.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : డ్రైవింగ్‌ ఆర్సీ కార్డుల విషయంలో వాహనదారుల పరిస్థితి సంకటంగా మారింది. కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినా జారీ చేయని పరిస్థితి. రవాణా శాఖలో సేవలు సులభతరం చేశామని కార్యాలయానికి రాకుండా అన్ని సేవలు మీ ముంగిట పొందవచ్చని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్‌, ఆర్సీ కార్డుల కోసం రవాణా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటోంది. వాహనం రోడ్డు ఎక్కితే చాలు లైసెన్స్‌, ఆర్సీలు చూపించమని అటు రవాణా శాఖ అధికారులు, ఇటు పోలీసు అధికారులు దబాయిస్తున్నారు. కార్డుల కోసం డబ్బులు చెల్లించామని కార్డులు ఇంకా ఇవ్వలేదని చెప్పినా చలానా రాసి చేతిలో పెడుతున్నారు. కొంతమంది వ్యాలెట్‌ యాప్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న కార్డు చూపితే అది అసలో.. నకిలీనో తమకు తెలియదు కార్డు ఉంటే చూపించు వదిలేస్తామని చెబుతున్నారు.

కార్డుల భారం తగ్గించిన

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

జిల్లా రవాణాశాఖ కార్యాలయంతో పాటు పులివెందుల, బద్వేల్‌, ప్రొద్దుటూరు పరిధిలో రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా సగటున 500 పైగా వాహన రిజిస్ట్రేషన్లు పరిమితి లైసెన్సులు జారీ చేస్తుంటారు. ఫిజికల్‌ కార్డుల కోసం ప్రభుత్వాలు అదనంగా ప్రతి కార్డుకు రూ.235 వసూలు చేసేవి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాహనదారులపై కార్డుల భారం తొలగించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డుల కోసం సెల్‌ఫోన్‌లో వ్యాలెట్‌ యాప్‌లు అందుబాటులో ఉంచింది. పోలీస్‌, రవాణాశాఖ అధికారులు అడిగినప్పుడు సేవ్‌ చేసుకున్న కార్డు చూపితే సరిపోతుంది. పొరపాటున కార్డు మర్చిపోతే వాహన చోదకులపై చలాన్‌ రాసే పరిస్థితి ఉండడంతో ఈ విధానానికి స్వస్తి పలికింది. డిజిటల్‌ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం వాహనం రోడ్డెక్కితే చాలు పోలీసు, రవాణా శాఖ అధికారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డులు చూపించమని వేధిస్తున్నారంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డులకు డబ్బులు చెల్లించి డౌన్‌లోడ్‌ చేసుకున్న కార్డు చూపితే సరిపోతుందని ప్రభుత్వ మార్గదర్శకాలు ఎక్కడా లేకపోవడంతో ఒరిజినల్‌ కార్డులు చూపించాలని లేదంటే కేసులు, చలానాలు రాస్తామని చెబుతున్నారు. కొంతమంది అధికారులు వాహనదారులు డౌన్‌లోడ్‌ చేసుకున్న కార్డులు చూపితే మిన్నకుంటున్నారు. ఎక్కువ మంది అధికారులు జరిమానా విధిస్తుండటంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. కార్డులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది. కనీసం సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డులు చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అలాగే కార్డులను త్వరగా ముద్రించి వాహనదారులకు అందజేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

లైసెన్స్‌, ఆర్సీ కార్డుకు రూ.235 చెల్లింపు

డిజిటల్‌ టెక్నాలజీకి తానే ఆద్యుడునని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన డిజిటల్‌ విధానానికి స్వస్తి పలకడమే కాకుండా వాహనదారులను దోచుకుంటున్నారు. గత ఏడాది నవంబర్‌ నుంచి మళ్లీ కార్డుల జారీ కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించడం ప్రారంభించారు. లైసెన్స్‌ జారీ రిజిస్ట్రేషన్‌ సమయంలో ప్రభుత్వ చలానాతో పాటు కార్డుకు ప్రత్యేకంగా రూ.235 వసూలు చేస్తున్నారు. గతే ఏడాది నవంబర్‌ నుంచి డబ్బులు చెల్లించిన వాహనదారులకు ఇంతవరకు కార్డులు అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 50 వేలకు పైగా లైసెన్స్‌, ఆర్సీ కార్డులు రావాల్సి ఉందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదంతా వాహనదారులను దోపిడీ చేసేందుకు ప్రభుత్వం మాస్టర్‌ స్కెచ్‌ వేసినట్లు అర్థమవుతోంది. కార్డుల విషయంలో నేటికీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు. కార్డుల ముద్రణ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలా ఏదైనా సంస్థకు అప్పజెప్పాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా కార్డులు ఎప్పుడు ముద్రిస్తాదో.. మాకు ఎప్పుడు వస్తాయో అంటూ వాహనదారులు ఎదురు చూస్తున్నారు.

గత ఏడాది నవంబరు నుంచి వాహనదారులకు అందని లైసెన్స్‌ కార్డులు

లైసెన్స్‌ జారీకి ప్రభుత్వ చలనాతోపాటు కార్డుకు రూ. 234 వసూలు

కార్డులు జారీ చేయకుండా చలానా పేరుతో కోట్లలో దోపిడీ

డిజిటల్‌ విధానానికి స్వస్తి పలికిన

చంద్రబాబు సర్కార్‌

జిల్లా వ్యాప్తంగా 50 వేల వరకు లైసెన్స్‌, ఆర్సీ కార్డుల పెండింగ్‌

అందని లైసెన్సు కార్డులు.. తప్పని అవస్థలు!1
1/1

అందని లైసెన్సు కార్డులు.. తప్పని అవస్థలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement