
చదువుపై ఆసక్తి తరిగి.. జీవితంపై విరక్తి కలిగి..
● ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలవన్మరణం
● ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం
● మృతదేహాన్ని సందర్శించిన పలువురు నాయకులు
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థి గురుగుబీలి నరసింహనాయుడు (17 చదువుకోవడం ఇష్టంలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇడుపులపాయలో ఉన్న ఆర్కే వ్యాలీ, ఒంగోలు క్యాంపస్‌లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఏడ్చల్ మండలం షేర్ మహమ్మదాపురం గ్రామానికి చెందిన అప్పలనాయుడు, రాజులమ్మ దంపతుల కుమారుడు నరసింహనాయుడు ఇడుపులపాయ క్యాంపస్‌లోని ఒంగోలు ట్రిపుల్ ఐటీలో పీయూసీ–2 (ఇంటర్ ద్వితీయ సంవత్సరం) చదువుతున్నాడు. ఇడుపులపాయ క్యాంపస్‌లోని పాపాగ్ని వసతి గృహంలో మరో ఐదుగురు విద్యార్థులతో కలిసి హాస్టల్ గదిలో ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున హాస్టల్ గదిలో ఉన్న బాత్రూం కిటికీకి తాడుతో ఉరివేసుకున్నాడు. నరసింహనాయుడు బాత్రూంలో నుంచి ఎంతసేపటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు తలుపులు కొట్టగా పలకకపోవడంతో అనుమానంతో సెక్యూరిటీ సిబ్బందికి సమాచారమందించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, ట్రిపుల్ ఐటీ అధికారులు తలుపులు పగలగొట్టి చూడగా కిటికీకి నరసింహనాయుడు వేలాడుతున్నాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.
చదువులో మంచి పట్టు..
నరసింహనాయుడుకు చదువులో మంచి పట్టు ఉన్నప్పటికీ మనస్థాపానికి గురయ్యాడు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా తెలిపారు. అయితే విద్యార్థి ట్రిపుల్ ఐటీలో చదవడం ఇష్టం లేనట్లు తెలిసింది. తాను నర్సింగ్ చేయాలని అనుకుంటున్నట్లు తోటి విద్యార్థులతో చెప్పేవాడు. తండ్రి అప్పలనాయుడు ఇటీవల మృతి చెందగా, తల్లి రాజులమ్మ నర్సుగా పనిచేస్తూ విద్యార్థిని చదివించేది. నరసింహనాయుడు పదవ తరగతిలో 566 మార్కులు సాధించి 2024లో ఒంగోలు ట్రిపుల్ ఐటీలో సీటు దక్కించుకున్నాడు. అయితే ఆ విద్యార్థికి త్రిబుల్ ఐటీ చదవడం ఇష్టం లేదు. నర్సింగ్ చేయాలన్నదే తన ఆశయంగా పెట్టుకున్నాడు. ట్రిపుల్ ఐటీలో చదవడం ఇష్టం లేక అప్పుడప్పుడు తోటి విద్యార్థులతో తాను ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుండేవాడని తెలిసింది. విద్యార్థి గత నాలుగు రోజులుగా ముభావంగా ఉండేవాడని తోటి విద్యార్థులు డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో విద్యార్థి సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఎవరెవరితో చాటింగ్ చేశాడో, ఫోన్ మాట్లాడాడో అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ అధికారులు ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ ఉలసయ్య దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం..
ఇడుపులపాయ క్యాంపస్‌లో ట్రీపుల్ ఐటీ విద్యార్థి నరసింహ నాయుడు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరమని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న నరసింహ నాయుడు మృతదేహన్ని రాంగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ధ్రువకుమార్ రెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్, సీపీఐ ఏరియా కార్యదర్శి వెంకటరాములు, బ్రహ్మయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు డాక్టర్ ఎస్‌ఎఫ్ బాషా వేర్వేరుగా సందర్శించారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎవరైనా మానసికంగా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వారికి అధికారులు కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.