
పది రోజులవుతున్నా నా కొడుకు జాడలేదు
ప్రొద్దుటూరు క్రైం : సుమారు 10 రోజులు అవుతోంది.. ఇంత వరకు నా కుమారుడి జాడ తెలియలేదు.. నీళ్లలో కొట్టుకొని పోతే ఎక్కడో ఒక చోట కనిపించాలి కదా.. ఇన్ని రోజులైనా అతని ఆచూకీ తెలియలేదు.. ముగ్గురు స్నేహితులే నా కుమారుడిని చంపేశారు.. అంటూ బాలుడి తల్లి, బంధువులు రోదిస్తున్నారు. మిట్టమడివీధికి చెందిన నాయుని విక్రం(18) అనే యువకుడు ఈ నెల 12న రామేశ్వరంలోని పెన్నానదిలో గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విక్రం కుటుంబ సభ్యులు గురువారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసు అధికారులతో మాట్లాడిన అనంతరం స్టేషన్ బయట వారు గురువారం రాత్రి మీడియా ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడికి నీళ్లంటే భయమని.. అలాంటి వ్యక్తిని ముగ్గురు స్నేహితులు వెంకటసాయి, శివలింగయ్య, మత్తయ్యలు బలవంతంగా పెన్నానదికి తీసుకెళ్లారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విక్రం నీళ్లలో గల్లంతయ్యాడని, అయితే ముగ్గురు స్నేహితులు మాత్రం సాయంత్రం 6 గంటల సమయంలో పోలీసులకు తెలిపారన్నారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఉంటే పోలీసులు వచ్చి కాపాడేవారని తల్లి రుక్మిణీ వాపోయింది. ఒక చెప్పు నీళ్లలో పడిపోతే దాని కోసం విక్రం నీళ్లలో దిగడంతో కొట్టుకొని పోయినట్లు స్నేహితులు చెబున్నారని, అయితే తన కుమారుడి రెండు చెప్పులు బయటనే ఉన్నాయని ఆమె తెలిపారు. చెల్లెలు పరీక్షల్లో ఫెయిల్ కావడంతో విక్రం నీళ్లలో దూకాడని మరొక స్నేహితుడు చెప్పాడన్నారు. విక్రంకు చెల్లెలు లేదని, తనకు ఇద్దరూ కుమారులేనని రుక్మిణీ తెలిపింది. అక్కడ జరిగినదానికి, స్నేహితులు చెప్పే మాటలకు పొంతన లేదన్నారు. దీంతో వారిపై అనుమానాలు బలపడుతున్నాయని బంధువులు అంటున్నారు. తన కుమారుడిని వాళ్లే బలవంతంగా తీసుకెళ్లి నీళ్లలో తోసేశారని తల్లి ఆరోపిస్తోంది. పోలీసులు ఇప్పటికై నా లోతుగా దర్యాప్తు జరిపి తన కుమారుడి జాడ కనిపెట్టాలని ఆమె కోరుతోంది.