
వరిలో కాలి బాటలు తీయాలి
మైదుకూరు : వరిలో కాలిబాటలు తీయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.చంద్రానాయక్ సూచించారు. ఇండి గ్యాప్ – పొలంబడి కార్యక్రమంలో భాగంగా గురువారం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాలెం గ్రామం వద్ద రైతు రంగయ్య పొలంలోకి దిగిన జిల్లా వ్యవసాయాఽధికారి రైతులతో మాట్లాడుతూ వరి నాటే సమయంలో కాలిబాటలు తీయడం వల్ల పంటకు గాలి వెలుతురు బాగా అందుతాయని పేర్కొన్నారు. దీని వల్ల చీడపీడలు కూడా సోకకుండా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బాలగంగాధర్‌రెడ్డి, ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది బాలయ్య, ఆదినారాయణ, ఎఫ్‌పీఓ పాల్గొన్నారు.
ఎరువుల దుకాణం తనిఖీ
అనంతరం మైదుకూరులోని శ్రీనివాస్ ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణాన్ని జిల్లా వ్యవసాయాధికారి చంద్రానాయక్ తనిఖీ చేశారు. దుకాణంలో ఎరువుల నిల్వలు అమ్మకాల వివరాలున్న రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు యూరియాను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని రైతులు అవసరమైన మోతాదులో వాడాలని సూచించారు. రైతులు పురుగు మందులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు షాపు యజమానులు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.