
తల్లి కారు అద్దాలను ధ్వంసం చేసిన కొడుకు
ప్రొద్దుటూరు క్రైం : తనకు ఇష్టం లేకున్నా చెల్లెలు పెళ్లి జరిపించిందనే కోపంతో స్వయాన తల్లికి చెందిన కారు అద్దాలను కుమారుడు ధ్వంసం చేశాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. వేంపల్లె మాగెన్నగారి వనిత బంగారు అంగళ్ల వీధిలో నివాసం ఉంటున్నారు. ఆమెకు కుమార్తె లక్ష్మీసౌమినితో పాటు కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఈ ఏడాది మార్చిలో ప్రేమించిన వ్యక్తితో కుమార్తె పెళ్లి జరిపించారు. అయితే ఈ పెళ్లి కుమారుడికి ఇష్టం లేదు. దీంతో తల్లి, కుమారుడి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ కారణంగా కుమారుడు తల్లి నుంచి దూరంగా దొరసానిపల్లెలో నివాసం ఉంటున్నాడు. వనిత మోడంపల్లెలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కొత్తగా ఇల్లు కడుతోంది. తన టయోటా అర్బన్ క్రూజర్ కారును నిలిపి ఉండగా గురువారం సాయంత్రం తన కుమారుడితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి కారు అద్దాలను ధ్వంసం చేశారు. అంతేగాక చంపుతామని వనితను బెదిరించారు. ఈ మేరకు ఆమె రాత్రి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.