
24 నుంచి పెద్దదర్గాలో ఉరుసు ఉత్సవాలు
కడప సెవెన్‌రోడ్స్ : మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ కడప నగరంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న అమీన్‌పీర్ దర్గాలో ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు దర్గా ప్రతినిధులు తెలిపారు. దర్గా 10వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హు స్సేనీ చిష్టివుల్ ఖాద్రి ఉరుసు ఉత్సవాల్లో భా గంగా ఈనెల 24న గంధం, 25న ఉరుసు, 26న తహలీల్ ఫాతెహా ఉంటుందన్నారు. ఉరు సు రోజు ప్రముఖ ఖవ్వాల్ మేరాజ్ వార్సీచే గొప్ప ఖవ్వాలీ కచేరి నిర్వహిస్తామన్నారు.
మోటారు వైర్ల చోరీ
మైదుకూరు : మైదుకూరు శివార్లలో వనిపెంట రోడ్డులో ఉన్న పొలాల్లో వ్యవసాయ మోటారు వైర్లను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. స్థానిక ఇందిరమ్మ కాలనీ సమీపంలోని పొలాల వద్దకు సంబంధిత రైతులు గురువారం ఉదయం వెళ్లగా మోటారుకు అమర్చిన స్టార్టర్ వైర్లను కత్తిరించి ఉండటం గమనించారు. దుండగుల పనిగా భావించి రైతులు లబోదిబోమంటున్నారు. ఇటీవలే ఈ ప్రాంతంలో దుండగులు మోటార్ వైర్లను చోరీ చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.