జమ్మలమడుగు : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి బుధవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఈనెల 12వ తేదీన అక్రమంగా అరెస్టు చేసి పులివెందుల నుంచి కడపకు తరలిస్తున్నామని చెప్పి రూటు మార్చి ఎర్రగుంట్ల మీదుగా వెళ్తుండటంతో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు సుధీర్‌రెడ్డితో పాటు మరో వంద మందిపైన కేసులు నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత ఈనెల 16వతేదీన విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అ యితే అనారోగ్యం కారణంగా 20వతేదీ హాజరవుతానని న్యాయవాదుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే బుధవారం పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యేను అధికారులు ఎవ్వరూ లేకపోవడంతో విచారించలేమని చెప్పి తిరిగి ఈనెల 25వతేదీన రావాలంటూ నోటీసులు ఇచ్చారు.
పట్టపగలే బంగారు దుకాణానికి కన్నం
– 25 తులాల బంగారు నగలు చోరీ
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని మోక్షగుండం వీధిలో పట్టపగలే బంగారు దుకాణానికి దొంగలు కన్నం వేశారు. మహబూబ్‌షరీఫ్‌కు చెందిన షాపులో సుమారు 25 తులాల మేర బంగారును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీనివాసనగర్‌కు చెందిన దరూబాయిగారి మహబూబ్‌షరీఫ్ కొన్నేళ్ల నుంచి దర్గాబజార్ సమీపంలోని మోక్షగుండం వీధిలో బంగారు నగల తయారీ షాపును నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో షెట్టర్‌కు తాళం వేసి భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లాడు. తిరిగి 4.30 గంటల సమయంలో దుకాణం తెరిచేందుకు రాగా షెట్టర్ తాళం తీసి ఉంది. దీంతో పూర్తిగా షెట్టర్ తీసి చూడగా పెట్టెలో బంగారు నగలు కనిపించలేదు. నగలు తయారు చేసేందుకు కస్టమర్ల నుంచి తీసుకున్న సుమారు 25 తులాల మేర ఉన్న బంగారు కనిపించలేదు.
మెయిన్ బజార్‌లోని వ్యాపారులు, స్వర్ణకారులందరూ మధ్యాహ్న సమయంలో దుకాణాలను మూసి ఇళ్లకు వెళ్తారు. ఆ సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. ఈ క్రమంలో దొంగలు నకిలీ తాళాలతో తాళం తీసి చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీం సిబ్బంది బంగారు షాపులో వేలి ముద్రలను సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నగల తయారీ షాపు యజమాని మహబూబ్‌షరీఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.