చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గజ్జల ఆంజనేయరెడ్డి, గజ్జల సుమిత్ర దంపతుల కుమార్తె గజ్జల శ్రావణి 19న విడుదలైన జాతీయ స్థాయి నీట్ మెడికల్ పీజీ పరీక్షలో 627 మార్కులతో 975వ ర్యాంకు సాధించారు. ఈమె తండ్రి భాకరాపేటలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఇరువర్గాలపై కేసు నమోదు
కాశినాయన : మండలంలోని సావిశెట్టిపల్లె గ్రామంలో స్థలం విషయంలో ఇరువర్గాల వారు కొట్లాడుకోవడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు బుధవారం ఎస్‌ఐ యోగేంద్ర తెలిపారు. వెంబడి పోలయ్య, వెంబడి సత్యరాజులు స్థలం విషయంలో గొడవ పడ్డారని, పోలయ్య వర్గంలో ఏడుగురిని, సత్యరాజు వర్గంలో 12 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యక్తికి గాయాలు..
మండలంలోని సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన విష్ణు తేజ గ్రామంలోని డంపింగ్ యార్డు వద్ద మేకలను మేపుకొంటున్నాడు. అదే సమయంలో డంపింగ్ యార్డులో శ్రీను, యువ, వినయ్‌లు మొక్కలు పెంచుతుండగా కుండీలు పగిలిపోయాయి. అక్కడే ఉన్న విష్ణు తేజ కుండీలు పగిలిపోతే ఇబ్బంది కదా అని అడిగినందుకు నువ్వు ఎవడ్రా మాకు చెప్పేందుకు అని విష్ణు తేజపై దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. వినయ్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యోగేంద్ర తెలిపారు.
గాయపడిన యువకుడి మృతి
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు– ప్రొద్దుటూరు రహదారిలో పల్సర్ బైక్‌లో ప్రొద్దుటూరుకు వెళుతుండగా రోడ్డు నిర్మాణ పనుల కోసం రోడ్డుపై నిలబెట్టిన డ్రమ్ములను ఢీకొన్న ఘటనలో మంచాల నవీన్ (20) అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ హైమావతి తెలిపారు. పట్టణంలోని ఎస్సీ కానీకి చెందిన మంచాల నవీన్ కూలి పనులు చేసుకొనేవాడు. సొంత పనుల నిమిత్తం మంగళవారం రాత్రి బైక్‌లో ప్రొద్దుటూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో గొరిగెనూరు గ్రామ శివార్లలో పనుల కోసం నిలబెట్టిన డ్రమ్ములను ఢీకొన్నాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వెళ్లి ప్రొద్దుటూరుకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తండ్రి ఓబులేసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.
మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి(65) ఒకరు మృతి చెందాడు. రెండు రోజుల కిత్రం అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన అతనికి జీఈ వార్డులో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో అతను మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడికి సంబంధించిన బంధువులు జిల్లా ఆస్పత్రిలో సంప్రదించాలని మార్చురీ ఇన్‌చార్జి వర్గాలు తెలిపాయి.

నీట్ పీజీ మెడికల్ పరీక్షలో శ్రావణికి 975వ ర్యాంకు